Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్. బ్లడ్ బ్యాంక్ కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్
రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వార్డులన్నీ తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాంపల్లి ఏరియా హాస్పిటల్‌కు చాలా మంది పేదలు వస్తారని, వారికి మెరుగైన సేవలు అందాలన్న ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ విన్నపం మేరకు వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండేవని, ఇప్పుడు సీఎం కేసీఆర్ మానవతా హృదయంతో ఆలోచించి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో డయాలసిస్ కేంద్రాల సంఖ్య కేవలం మూడు ఉంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి సంఖ్య 102కు పెంచామన్నారు. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని తెలిపారు. వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్‌ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో డయాలసిస్ రోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించామన్నారు. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద రూ. రూ. 10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందని, దాంతో పాటు మందులను కూడా ఉచితంగా (రూ.15 వేలు విలువ చేసే) జీవిత కాలం అందిస్తున్నామని తెలిపారు. కిడ్నీ రోగుల కోసం ఏడాదికి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే, అందులో ఒక్క డయాలసిస్ రోగి కోసం ఏడాదికి రూ.100 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. ఇక రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకుల సంఖ్య 56కు పెంచామన్నారు 27 బ్లడ్ బ్యాంక్‌లకు కాంపోనెంట్ సపరేటర్స్ ఇచ్చి వాటి వల్ల ఒక యూనిట్ రక్తాన్ని ముగ్గురు, నలుగురికి వాడుతున్నామని తెలిపారు. ఇక నగరం నలువైపులా టీమ్స్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
గచ్చిబౌలి టీమ్స్ ఆస్పత్రిని 1000 పడకలకు అప్డేట్ చేస్తున్నామని తెలిపారు. నిమ్స్‌కు అదనంగా 2000 పడకలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఇక ట్రామా కేర్ సెంటర్‌ను లెవల్ 1, 2, 3గా వర్గీకరించి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేసే కార్యక్రమం ఒకటి, రెండు వారాల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్, డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్, ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ డాక్టర్ సునీత, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీదేవి, డీ బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్స్, డాక్టర్లు అరుణ పద్మావతి, శ్రీలత, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.