Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపాల్ బెదిరించారు
- ఫీజు కట్టలేదని బాలుడిని నిర్బంధించారు
- చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విద్యార్థి తండ్రి ఫిర్యాదు
- సిరిసిల్ల జిల్లా శ్రీ చైతన్య పాఠశాలలో ఘటన
నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట
దళితుడివైనందున ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని, శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ కులం పేరుతో దూషించడమే కాక, ఫీజు కట్టలేదని తన కుమారుడిని పాఠశాలలో నిర్బంధించారని విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని శ్రీచైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కట్కూరి బాబు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం. తన పెద్ద కుమారుడు కట్కూరి సుకుమార్ 3వ తరగతి, చిన్న కుమారుడు కట్కూరి 1వ తరగతి శ్రీచైతన్య పాఠశాలలో చదువుతున్నారు. అకాడమిక్ ప్రారంభం కాకముందే నోట్‌బుక్స్ కోసం ఇద్దరికి కలిపి రూ.10వేలు తీసుకున్నారు. కాని సగం బుక్స్ మాత్రమే ఇచ్చారు. దాంతో తాను కూడా సగం ఫీజు కట్టాను. మిగితా బుక్స్ ఇస్తేనే ఫీజు కడుతానని.. లేకుంటే ఆ డబ్బులు ఫీజులో చూసుకోవాలని యాజమాన్యానికి చెప్పారు. కాగా ఈ నెల 18న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు తన కొడుకు సుకుమార్‌ని శ్రీచైతన్య ప్రిన్సిపాల్ ప్రియాంకరెడ్డి స్కూల్ ఫీజు కట్టలేదని క్లాస్ రూమ్‌లో పెట్టి నిర్భందించినట్టు వాపోయాడు. ఈ విషయంపై వెళ్లి అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండని దురుసుగా మాట్లాడారని.. పైగా టీసీ ఇస్తానని ప్రిన్సిపాల్ బెదిరించారని తెలిపారు.
ఇంతవరకు ఫీజు కట్టలేదు ఏమి అనిపిస్తాలేదా అని అవమానించారన్నారు. ఒక చిన్న బాలుడని చూడకుండా విచక్షణ లేకుండా 4 గంటల పాటు క్లాస్ రూమ్‌లో నిర్భందించడమే కాకుండా, తాము దళితులైనందున ప్రభుత్వ పాఠశాలలో చదువు కోవాలని ప్రిన్సిపాల్ చులకనగా మాట్లాడినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.