Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2025 వరకు ఏర్పాటుకు చర్యలు
- తెలంగాణ రెడ్కో చైర్మెన్ వై.సతీష్‌రెడ్డి
- ఈవీ రంగం, అనుబంధ రంగాలప్రతినిధులతో సమావేశం
- చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూట్ మ్యాప్ కోసం కమిటీ
- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు రావాలని పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్, ఇతర మౌలికవసతులు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(రెడ్కో) కృషి చేస్తోందని ఆ సంస్థ చైర్మెన్ వై.సతీష్‌రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పనను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ఎలక్ట్రిక్ వాహన రంగం, దాని అనుబంధ రంగాలకు చెందిన ప్రతినిధులతో హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2025నాటికి 3వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాల ఏర్పాటే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌లోనే ఎక్కువగా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకోసమే సదస్సు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ మారుమూల ప్రాంతంలోనూ చార్జింగ్ వసతులు కల్పించే దిశగా ప్రయత్నాలు చేపట్టామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీ ల్లోనూ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ వసతి కల్పిస్తామని వివరించారు. గతేడాదిలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దాదాపు ఐదు రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాల్లో చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల విశ్వాసం కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీనికోసం ఆ రంగంలోని సంస్థలు కలిసి రావాలని కోరారు.
తెలంగాణ రెడ్కో స్వయంగా ఇప్పటికే 150 చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని సతీష్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పీపీపీ)లో దేశంలోనే మొదటి చార్జింగ్ కేంద్రం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల న్నింటిలో కలిపి హైదరాబాద్‌లో దాదాపు 500 చార్జింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్య త్వరలోనే మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్కో వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, జీఎం ప్రసాద్, వాహన తయారీ సంస్థల ప్రతినిధులు, వాహన డీలర్లు, చార్జింగ్ స్టేషన్ నిర్వహణ సంస్థల ప్రతినిధులు, ఫ్లీట్ సర్వీస్ ఆపరేటర్లు పాల్గొన్నారు.