Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 నుంచి దశలవారీగా నిరసనలు
- మే 3న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, వంటావార్పు
- కార్యాచరణ ప్రకటించిన ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, తదితర సమస్యల్ని పరిష్కరించాలనీ డిమాండ్ చేస్తూ చేస్తున్న సమ్మెను మరింత ఉధృతం చేయనున్నట్టు తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) ప్రకటించింది. ఈ నెల 17 నుంచి సమ్మె చేస్తున్నా సెర్ప్ ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమనీ, 21 నుంచి దశలవారీగా నిరసనలు తెలుపుతామని వెల్లడించింది. మే మూడో తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, అక్కడే వంటావార్పు నిర్వహిస్తామని తెలిపింది. రాష్ట్ర కమిటీ పిలుపులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. గురువారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ మాట్లాడుతూ..వీఓఏలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, ఆన్లైన్ వర్క్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీఓఏలు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ అనుకూల సంఘాలు అసత్య ప్రచారాలు చేయడాన్ని ఖండించారు. ఇది సరైన వైఖరి కాదని నొక్కి చెప్పారు. పదేండ్లుగా 18 వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ సంఘాలకు పట్టవా అని ప్రశ్నించారు. రూ.3,900 వేతనంతో ఎలా బతకాలో చెప్పాలని ప్రశ్నించారు. వీఏఓల మేలు కోసం తాము చేస్తున్న పోరాటంలో కలిసిరావాలని కోరారు. ధర్నాలు, సమ్మెలు, వంటావార్పులు చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనే విషయాన్ని ఏలికలు గుర్తుంచుకోవాల న్నారు. సమ్మెల పట్ల నిర్బంధం విధించడాన్ని తప్పుబట్టారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ..గ్రామీణ స్థాయిలో పేదరికం నిర్మూలన కోసం పనిచేస్తున్న వీఓఏలకు రూ.3,900 వేతనం ఇస్తే ఎట్లా అని నిలదీశారు. ఓవైపు తమ హక్కుల కోసం వీఓఏలు సమ్మె చేస్తుంటే.. ధాన్యం కొనుగోళ్లను ఏదో ఒక పద్ధతిలో కొనుగోలు చేస్తామని సెర్ప్ ఉన్నతాధికారులు మాట్లాడటం తగదన్నారు. ఈ విషయంలో సెర్ప్ సీఈఓ సందీప్‌కుమార్ సుల్తానియా జోక్యం చేసుకుని వీఓఏ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేశ్ మాట్లాడుతూ...దశలవారీగా చేయనున్న పోరాటాల కార్యాచరణను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్‌కుమార్, కోశాధికారి సుమలత, సహాయ కార్యదర్శులు శరత్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ కార్యాచరణ ఇదే..
- ఈ నెల 21 చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన
- 24న ఒంటి కాలుపై నిలబడి నిరసన
- 25న కండ్లకు గంతలు కట్టుకుని ప్లకార్డులతో నిరసన
- 26న రోడ్లను ఊడ్చి నిరసన
- 27న మోకాళ్లపై కూర్చొని నిరసన
- రూ.3900 వేతనం సరిపోవట్లేదని రాష్ట్ర సర్కారుకు తెలిసేలా 28న భిక్షాటన
- తినేందుకు జీతం చాలట్లేదని 29న ఆకులు తింటూ నిరసన
- మేడే సందర్భంగా సమ్మె చేస్తున్న టెంట్ల దగ్గర జెండాల ఎగురవేత
- మే 3న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, వంటావార్పు కార్యక్రమం