Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగిన పదోన్నతులు, బదిలీలు
- ఆఫీసులు, ఇన్ఫ్రాస్టక్చర్ ఏర్పాటులో జాప్యం
- జీవో జారీ చేసి నాలుగు నెలలైనా కార్యాచరణకు నోచట్లే
- రూ.1400 కోట్లు కేటాయింపు.. ఖర్చవ్వని వైనం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఆర్అండ్బీ డిపార్ట్మెంట్, ఛీఫ్ ఇంజనీర్ (ఆర్అండ్బీ), అడ్మినిస్ట్రేషన్ అండ్ రోడ్డు భవనాల శాఖల ఇంజనీర్లతో సుదీర్ఘంగా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బీ పునర్వవస్థీకరణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2022 డిసెంబర్ 31న జీవో ఎంఎస్ నెంబర్ 51 జారీ చేసింది. రాష్ట్రం గణనీయ పురోగతిని సాధించడం, అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ట్రాక్టర్లు, హర్వేస్టర్లతో సహా ఇతర రకాల వాహనాల వినియోగం అనేక రెట్లు పెరిగినందున రోడ్ల నిర్వాహణ, విస్తరణ అవసరాన్ని కూడా పెంచిందని ప్రభుత్వం పేర్కొంటుంది. పెరుగుతున్న ట్రాఫిక్‌ను సవాల్‌గా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రహదారుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. సమర్థవంతమైన పర్యవేక్షణతో పాటు అర్ అండ్ బీ కి సంబంధించిన ఇంజనీర్లకు ఏకరీతి పని భారం ఉండేందకు వీలుగా పునర్వవస్థీకరణ చేయాలని నిర్ణయించింది.
పునర్వవస్థీకరణ ఇలా..
ఇంజనీర్ల సమీక్షలో వచ్చిన సూచనల్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రవాణా, రోడ్డు భవనాల శాఖను పునర్వవస్థీకరణ చేయాలని 2022 డిసెంబర్ 31న జీవో ఎంఎస్ నెంబర్ 51 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆర్ అండ్ బీ శాఖ రూపురేఖలే మారిపోనున్నాయి. కొత్త కార్యా లయాలు, కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో మూడు కొత్త చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాలు, రెండు టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాలు, ఒక చీఫ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) కార్యాలయం, 10 కొత్త సర్కిళ్లు, 13 కొత్త డివిజన్లు, 79 కొత్త సబ్ డివిజన్లు, 124 సెక్షన్లు, ఒక సర్కిల్, 3 డివిజన్లు, 15 సబ్ డివిజన్లు, 96 విభాగాలను రూపొం దించారు. మెరుగైన పర్యవేక్షణ కోసం ఇప్పటికే ఉన్న కార్యాలయాలను మార్చాల్సి ఉంటుంది. సెక్షన్లు ఏర్పాటుతో పాటు రోడ్డు, భవనాలు, జాతీయ రహదారులు, భవనాలు, ఎలక్ట్రికల్, క్యాలిటీ కంట్రోల్‌కు ప్రత్యేకమైన సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల్ని పెట్టడం ద్వారా కొత్త పోస్టుల్ని భర్తీ కానున్నాయి. కార్యాలయాలు, ఇన్ఫ్రాస్టక్చర్, నియమాకాలు, పదోన్నతుల కోసం కసరత్తు చేసిన ప్రభుత్వం కార్యాచరణకు పూను కోవడంలో జాప్యం చేస్తుందని పలువురు ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.
472 పోస్టుల సృష్టికి అనుమతి
రోడ్డు భవనాల శాఖను పునర్వవస్థీకరణ చేయడం ద్వారా ఆ శాఖ పరిధిలో పెరిగిన అవసరాల మేరకు 472 కొత్త పోస్టులు సృష్టించబడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను రెండేండ్ల వరకు డైరెక్టు రిక్రూట్మెంట్ పద్దతి కాకుండా పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రెండు చీఫ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు, ఒక చీఫ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 10 సూపరింటెండెంట్ ఇంజనీర్ (సివిల్), రెండు సూపరింటెండెంట్ (ఎలక్ట్రికల్), 11 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), రెండు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 90 డిప్యూటీ ఇంజనీర్ (సివిల్), 12 డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్), 31 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 7 నాన్‌టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్, 23 టెక్నికల్ ఆఫీసీర్లు, 28 డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్లు గ్రేడ్-2 పోస్టులు, 23 సూపరింటెండెంట్ పోస్టులు, 13 అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్లు, 11 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, 13 సీనియర్ అసిస్టెంట్లు పోస్టులు, 61 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది.
పనులు, పర్యవేక్షణ కుంటు
పునర్వవస్థీకరణ జరగకపోవడం వల్ల ఆర్ అండ్ బీలో పనులు, పర్యవేక్షణ కుంటుపడు తుందని పలువురు ఇంజనీర్లు, సెక్షన్ అధి కారులు పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తామని ప్రకటిం చిన కార్యాలయాల్ని ఏర్పాటు చేయలేదు. కొత్తగా గుర్తిం చిన ప్రాంతాల్లో ఆయా కార్యాలయాలు ఏర్పడక పోవడంతో పాత కార్యాలయాల్లో పనిచేస్తున్న అధి కారులు, ఉద్యోగులు తమ సేవల్ని, విధుల్ని విస్తరించ లేకపోతు న్నారు. కార్యాలయాల ఏర్పాటు, ఇన్ ఫ్రాస్టక్చర్, పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం రూ.1400 కోట్ల మేరకు నిధుల్ని కేటాయించినప్పటికీ పనులు ముందుకు సాగట్లేదు.
నాలుగు నెలలుగా పదోన్నతులు, బదిలీల జాప్యం
రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పునర్వవస్థీకరణ జీవో వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అమలుకు నోచట్లేదు. కొత్తగా సృష్టించబడిన 472 పోస్టులకు సంబంధించి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. జీవోను అమలు చేయకపోవడం వల్ల పదోన్నతులు పొందే ఉద్యోగులు నిరాసతో ఉన్నారు. డివిజనల్ ఎకౌంట్ ఆఫీసర్ అర్హత పరీక్ష 2017లో నిర్వహించిన ప్రభుత్వం అందులో అర్హత సాధించిన ఉద్యోగులకు ఇప్పటికీ పదోన్నతులు కల్పించలేదు. ఆర్ అండ్ బీ పునర్వవస్థీకరణ జరిగితే వారందరికీ పదోన్నతి లభించనుంది. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసే సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లోకి ఉద్యోగుల బదిలీలు జరగాలి. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ జరగకపోవడంతో వందలాది మంది ఆర్ అండ్ బీ ఉద్యోగులే కాకుండా పదోన్నతుల కోసం అర్హుల పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఇతర శాఖల ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. మూడు చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాలతో పాటు మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రిభువనగిరిలో ఆర్ అండ్ బీ, వరంగల్ (ఎలక్ట్రికల్), నిజామాబాద్ (నేషనల్ హైవే)కు సంబంధించి సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. ములుగు, గజ్వేల్, భద్రాచలం, మిర్యాలగూడ, నారాయణపేటలో ఆర్ అండ్ బీ, నిజామాబాద్, వరంగల్ (ఎలక్ట్రికల్), జనగాం, మహాబూబ్‌నగర్, సిద్దిపేట (నేషనల్ హైవే), ప్రాజెక్టు డివిజన్-1, ప్రాజెక్టు డివిజన్-2, ప్రాజెక్టు డివిజన్ -3 భవనాల డివిజన్ కార్యాలయాలు నెలకొల్పాలి. వీటితో పాటు 79 సబ్ డివిజన్, 124 సెక్షన్ కార్యాలయాల్ని ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు.