Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరెంట్ షాక్‌తో పంచాయతీ కార్మికుడు మృతి
- ఉస్మానియాలో చికిత్స అందించినా దక్కని ప్రాణం
- మరో ఘటనలో చేయి కోల్పోయిన జీపీ వర్కర్
- చస్తున్నా మొండిపట్టులో రాష్ట్ర సర్కారు
- ట్రాక్టర్ ప్రమాదాల్లోనూ చనిపోతున్న సిబ్బంది
- తెరపైకి మల్టీపర్పస్ రద్దు డిమాండ్
రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన మల్టీపర్పస్ విధానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చుక్కాలబోడుకు చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు భూక్యా వెంకటేశ్ ప్రాణాన్ని బలితీసుకున్నది. నాలుగైదు రోజులుగా నరకయాతన అనుభవిస్తూ ఉస్మానియా ఆస్పత్రిలో పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో చనిపోయాడు. 'రెండు కాళ్లు తీసేసినా ప్రాణాలతో కండ్లముందట మనిషి కనిపిస్తే చాలు అదే కొండంత భరోసా అన్న వెంకటేశ్ భార్య శ్రీవాణి ఆశ నెరవేరలేదు. తన భర్తను కాపాడాలని మొరపెట్టుకున్నా ఏ దేవుడూ ఆ తల్లి వేడుకోలును ఆలకించలేదు. పాలకుల అనాలోచిత నిర్ణయం...పని రాకపోయినా మేం ఆదేశిస్తే చేయాల్సిందేనన్న అధికారుల తీరు ఒక నిండు ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నది. భార్యనూ, బుడిబుడి అడుగులు వేస్తున్న ఇద్దరు చిన్నారులను రోడ్డుపాలు చేసింది. అదే ఉస్మానియా ఆస్పత్రిలో సిద్ధిపేట జిల్లాకు చెందిన మరో కార్మికుడూ చేయిని కోల్పోయి, దేహమంతా కాలిన గాయాలతో క్షోభను అనుభవిస్తున్నాడు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వెంకటేశ్ నాయక్ అనే యువకుడు నాలుగున్నరేం డ్లుగా చుక్కాలబోడులో పంచాయతీ కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కూలినాలి చేస్తున్నది.
స్వచ్ఛభారత్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డులోని రైతు వేదికలో గ్రామపంచాయతీ కార్మికులు, గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఓఏలకు శిక్షణా కార్యక్రమం ఐదు రోజుల కిందట నిర్వహించారు. ఆ సమయంలో రైతు వేదిక హాల్లో కరెంటు రాకపోవడంతో స్తంభం ఎక్కి చూడాలని వెంకటేశ్‌ను అధికారులు ఆదేశించారు. 'సార్ నాకు ఆ పనిరాదు. నేను పోను' అని వెంకటేశ్ వారించారు. ఓ సర్పంచ్ జోక్యం చేసుకుని 'జీతం తీసుకోవట్లేదా? చెప్పిన పనెందుకు చేయవు? ఆ లైన్‌కు ఎల్సీ తీసుకున్నాం పో. నీకేం కాదు' అంటూ కోప్పడ్డాడు. ఎదురుతిరిగితే ఎక్కడ ఉద్యోగం పీకేస్తారో అన్న భయంతో చేసేదేమీ లేక వెంకటేశ్ భయపడుతూనే స్తంభం ఎక్కాడు. సర్పంచ్ ఓ లైన్‌కు ఎల్సీ అడిగితే లైన్మెన్ మరో లైన్‌కు ఎల్సీ ఇచ్చాడు. ఎల్సీ తీసుకున్నారనే భరోసాతో రైతు వేదికకు సంబంధించిన వైరును స్తంభంపై కలిపేందుకు యత్నించాడు. అంతే అతనికి షాక్ కొట్టింది. శరీరమంతా కాలిపోయింది. ఖమ్మంలో రెండు, మూడు ఆస్పత్రులకు వెళ్లారు. పరిస్థితి క్రిటికల్‌గా ఉంది హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. ఇక లాభంలేక హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. 'చాలా రిస్క్, మా ప్రయత్నం మేం చేస్తాం' అని ఉస్మానియా వైద్యులు కూడా చెప్పారు. అతని దేహమంతా కాలడంతో పాటు రెండు కాళ్లకూ ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలో అతని కాళ్లను తీసేశారు. శరీరాన్ని బ్యాండేజ్‌తో చుట్టి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. గురు వారం నుంచి ఏ ఆహారం తీసుకోలేదు. కేవలం వెంటిలేషన్ మీదనే శ్వాసతీసుకున్నాడు. చివరకు శుక్రవారం సాయంత్రం చనిపోయాడు. నాలుగు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్ నాయక్‌ను పరామర్శించిన అధికారే లేడు. ఎమ్పీడీఓగానీ, స్తంభం ఎక్కాలని ఉసిగొల్పిన సర్పంచిగానీ, ఒకలైన్కు బదులు మరోలైన్కు ఎల్సీ ఇచ్చిన లైన్మెన్గానీ వెంకటేశ్‌ను పలుకరించిన పాపానపోలేదు. పంచాయతీ కార్మికుల సంఘాల జేఏసీ నాయకులు కలెక్టర్‌ను కలిస్తే ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డీపీఓను ఆదేశించారు. ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం శ్రీవాణిని పలుకరించగా... నాలుగేండ్ల పాప, రెండేండ్ల బాబును ఎలా సాకాలనే ఆందోళన ఆమె మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ''రెండు రోజుల నుంచి ఏం తింటలేడు. పైపు పెట్టి ఆక్సిజన్ అందిస్తున్నరు. ఏం పనిచేయకపోయినా సరే సార్ బతికి కండ్లముందు కనిపిస్తే మాకు అదే కొండంత భరోసా. ఆ దేవుడు ఏం జేస్తడో ఏమో?'' అంటూ బాధాతప్త హృదయంతో చిన్న గొంతుతో తన గోస వెళ్లబోసుకున్నది. ఏంటమ్మా? వెంట ఎవ్వరూ లేరా అని అడిగితే...'మా మరిది మొన్నటిదాకా ఉన్నడు. నిన్న మా తమ్ముడు ఒచ్చిండు...' అని చెప్పుతుండగా..ఆమె మాటల్లో ఎవరైనా రెండు, మూడు రోజులు చూసి పోతరుగానీ ఎల్లకాలం మా వెంట ఉండరుకదా అనే భావన కనిపించింది. రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన అనాలోచిత విధానం వల్ల తన భర్త ప్రాణాలను కోల్పోయింది. ఆ కుటుంబాన్ని ఆదుకుని భరోసా కల్పించాల్సిన బాధ్యత ముమ్మాటికీ రాష్ట్ర సర్కారుపై ఉంది. ఆచరణలో మన పాలకులు ఏం చేస్తారో చూడాలి.
పక్కఫొటోలో చేయి తీసేసి తీవ్ర గాయాలతో మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న పంచాయతీ కార్మికుని పేరు మహేందర్. ఇతనిది సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి. ఉదయం ఆరున్నర సమయంలో పక్క ఊర్లో కరెంటు రావడం లేదని తీసు కెళ్లారు. లైన్ చెక్ చేయడం కోసం స్తంభం ఎక్కాడు. కరెంటు పనిపై సరిగా అవగాహన లేని మహేందర్ కరెంట్ షాక్‌కు గురయ్యి కింద పడిపోయాడు. ఇన్ఫెక్షన్ అవ్వడంతో అతని చేయి తీసేశారు. ఇప్పుడు మహేందర్ కూడా ఉస్మా నియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 'నీవేం టెన్షన్ పడకు. నీకేం అవసరమైనా మేం చూసుకుంటాం' అని సర్పంచి మా టిచ్చారని బాధితుని వెంట ఆస్పత్రిలో ఉన్న బంధువులు చెప్పారు. ఆ మాట ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందో? నీటి మీది రాతలా మారుతుందో? అనేది మున్ముందు చూడాలి.
ఈ ఘటనలే కాదు...చనిపోయినోళ్లు వందల్లోనే
ఈ రెండు ఘటనలు మన కండ్లకు కనిపించిన సజీవ దృశ్యాలు. ఈ మల్టీపర్పస్ విధానంతో చనిపోయినోళ్లు వందల్లోనే ఉన్నారు. రాష్ట్రంలో ట్రాక్టర్ ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల సంఖ్యా తక్కువేం కాదు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కన్నెకల్లుకు చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు జి.నరేశ్ వాటర్ ట్యాంకర్‌ను తీసు కెళ్తుండగా పైభాగంలో విద్యుత్ వైరు తాకి చనిపోయాడు. మిర్యాలగూడ మండలంలోని ఓ కార్మికులు కరెంట్ షాక్‌తో రెండు చేతులను కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా అయిటి పాములలో చెట్లకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్‌పై వెళ్తుండగా లారీ ఢకొీట్టడంతో ట్రాక్టర్ రెండు ముక్కలై జానయ్య అనే కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో ఓ కార్మికుడు, సిరిసిల్ల జిల్లాలో మరో కార్మికుడు, ఇలా చాలా మంది చనిపోయారు.
మల్టీపర్పస్ అంటే...?
గతంలో గ్రామపంచాయతీల్లో మోరీలు తీసేందుకు, రోడ్లు ఊడ్చేందుకు కామాటీలు ఉండేవారు. నల్లాలు పెట్టేందుకు మరొకరు, వీధిదీపాలు పాడైతే వాటిస్థానంలో కొత్తవాటిని వేసేందుకు ఎలక్ట్రిషియన్, పంచాయతీలో బిల్లులు వసూలు చేసేందుకు బిల్ కలెక్టర్లు, కారోబార్లు ఉండేవారు. ఎవరి పని వారు చేసేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్ యాక్టు తీసుకొచ్చి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని పనులనూ కార్మికులు చచ్చినట్టు చేయాలని కండీషన్ పెట్టింది. ఏ శాఖలోనూ ఇలాంటి విధానం లేదు. దీనిపై మొదటి నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. లక్షలకు లక్షల జీతాలు తీసుకునే అధికారులకు లేని షరతులు రూ.8,500 జీతగాడికి ఎందుకనే ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర సర్కారు నిర్ణయంతో అనుభవం లేని వాళ్లూ కూడా ట్రాక్టర్లను నడపాల్సి వస్తున్నది. కరెంటు పనిపై అవగాహన లేని కార్మికులతో స్తంభాలు ఎక్కిస్తున్నారు. దీనివల్ల పంచాయతీ కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. మంచిగా ఉన్నప్పుడు అన్ని పనులు చేయిస్తున్న పాలకమండలి సభ్యులు ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబానికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబాలను పట్టిం చుకోవట్లేదు.ఇంటిపెద్దను కోల్పోయిన ఆ కుటుంబాలు రోడ్డు న పడుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ఎస్.కే.డే పథకం గురించి గొప్పగా చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు.
వేధింపులూ ఎక్కువే...తట్టుకోలేక ఆత్మహత్యలు, యత్నాలు
తుమ్మితే ఊడిపోయే ఈ ఉద్యోగంలో అడుగడుగునా వేధింపులే. అధికారులు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతి నిధులు చెప్పినట్టు బానిసల్లా పనిచేయాల్సిందే. లేదంటే కక్షపూరిత చర్యలకు గురికావాల్సిందే. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామంలో 'అందరి ముందు ఎందుకు తిట్టావు?' అని ప్రశ్నించిన పంచాయతీ కార్మికుడు బడె సాంసస్పై సర్పంచ్, అతని కుటుంబ సభ్యులు దాడి చేయడంతో చనిపోయిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో సర్పంచ్ వేధింపులు తాళలేక రావులపల్లి వెంకటయ్య అనే కార్మికుడు గడ్డిమందు తాగాడు. సకాలంలో గుర్తించి వైద్యం అందించడంతో బతికి బట్టగట్టాడు. చండూరు మండలం కస్తాల గ్రామంలో వార్డు మెంబర్ వేధింపులు తాళలేక ఓ కార్మికుడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. ఇవి కనిపించే ఘటనలే. కనిపించని వేధింపులెన్నో..!
మల్టీపర్పస్ను రద్దు చేయాలి..
రూ.20 లక్షల ఇన్సూరెన్స్ చేయాలి
అనుభవం లేని పనులను కార్మికులతో బలవంతంగా చేయించడం దారుణం. ఈ క్రమంలోనే ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఈ ఒక్కనెలలోనే నలుగురు పంచాయతీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి విధానం అవసరం లేదు. తక్షణమే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఎస్.కే.డే పథకం నిరుపయోగంగా మారింది. పంచాయతీ కార్మికుల పేరుతో రూ.20 లక్షల ఇన్సూరెన్స్ చేయించాలి. బాధిత కుటుంబాలకు ఇండ్లు కట్టించి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి