Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరమ్మ లబ్దిదారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాం : జనగామలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-జనగామ
ఇందిరమ్మ మూడో విడత ఇండ్ల స్థలాల లబ్దిదారులను మోసం చేస్తే ఊరుకునేది లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జనగామ జిల్లా బాణాపురంలోని మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల స్థలాల లబ్దిదారులకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద చేస్తున్న ఆందోళనకు శుక్రవారం తమ్మినేని వీరభద్రం సంఘీభావం తెలిపారు. సీపీఐ(ఎం) జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ మొత్తం కాలినడకన తిరిగి సందర్శించడం, లబ్దిదారుల ఇబ్బందులను తమ్మినేని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు. 2012 - 13 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం షామీర్పేట శివారు ప్రస్తుతం జనగామ పట్టణంలో 1144 మందికి పట్టాలిచ్చారని, ప్రస్తుతం వారిని సర్వేల పేరుతో మోసం చేసే కుట్ర జరుగుతున్నదని అన్నారు. పేదల సమస్యలను, త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి లబ్దిదారులకు న్యాయం జరిగే విధంగా పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. పేద లబ్దిదారులకు సీపీఐ(ఎం) ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు 2018 సంవత్సరం నుంచి మూడవ విడత ఇందిరమ్మ లబ్దిదారులతో జరిపిన చర్చల సందర్బంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు ప్రవర్తించడంతో పార్టీ నాయకత్వం లబ్దిదారులకు అండగా నిలబడి పోరాటం చేస్తోందని తెలిపారు. లబ్దిదారుల విషయంలో హైకోర్టులో కేసు వేశారని, హైకోర్టు కూడా లబ్దిదారులకు ఇండ్లు ఇవ్వాలని చెప్పిందన్నారు. కానీ ప్రభుత్వ అధికారులు సర్వేల పేరుతో ఇండ్ల స్థలాల లబ్దిదారులను మోసం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పట్టాలు ఉన్న వారికి కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామని చెప్పడం దుర్మార్గం అన్నారు. ఒకరి పట్టా తీసుకొని ఇంకొకరికి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అ విషయంలో వారికి న్యాయం జరగకుంటే మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించటానికి సిద్దంగా ఉన్నామన్నారు. కాగా, ఈ వారంలో సీఎంని కలిసే అవకాశం ఉందని, ఈ విషయాన్ని తప్పనిసరిగా ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేటట్టుగా కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్తో స్నేహం రాజకీయంగా బీజేపీతో వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రాతిపదికమీదే ఉందన్నారు. ఎన్నికల్లో స్నేహం ఉండే అవకాశం ఉన్నా సమస్యలపై పోరాటం పోరాటంగానే ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, బోట్ల శేఖర్, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, సుంచు విజేందర్, బోడ నరేందర్, పి. ఉపేందర్, బి. చందు నాయక్, ఆఫీస్ ఇన్చార్జి బిట్ల గణేష్, మూడవ విడత లబ్దిదారుల సంఘం అధ్యక్షులు కళ్యాణం లింగం, పట్టణ కమిటీ బాల్నే వెంకటమల్లయ్య, పందిళ్ళ కళ్యాణి పల్లెర్ల లలిత, చిర్ర రజిత, పల్లెర్ల శంకర్, విష్ణు, ఏ. సురేష్, వినోద్, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.