Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది కొత్త పోస్టులు మంజూరు
- కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా సంతోష్ నియామకం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ దిద్దుబాటు కోసం, నిరుద్యోగ అభ్యర్థుల్లో భరోసా నింపేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కమిషన్‌లో పది కొత్త పోస్టులను మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్లో లా ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు జీవో నెంబర్ 37ను శుక్రవారం విడుదల చేశారు. టీఎస్పీఎస్సీని పటిష్టం చేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. నియామకాల ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని వివరించారు.
పరీక్షల కంట్రోలర్‌గా బిఎం సంతోష్
టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి బిఎం సంతోష్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికు మారి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్‌గా బిఎం సంతోష్‌ను నియమిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన హెచ్‌జీసీఎల్ ఎండీగా, ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్, ప్రత్యేక అధికారిగా బాధ్యతల్లో ఉన్నారు. ఆయన్ను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేస్తున్నట్టు హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.