Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సందీప్‌కుమార్ సుల్తానియా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ శాఖ కమిషనర్ హన్మంతరావుతో కలిసి అన్ని జిల్లాల డీఆర్డీఓలు, అదనపు డీఆర్డీఓలతో ఉపాధి హామీ పనులు, కూలీల హాజరుపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారుల పర్యవేక్షణా లోపంతో కూలీల హాజరు తగ్గితే ఎట్టిపరిస్థితిల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రతి రోజూ గ్రామపంచాయతీలో 200కు తగ్గకుండా కూలీలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పనులు కాగానే మస్టర్స్ నమోదు జరిపి చెల్లింపులు చేయాలన్నారు. ట్యాంకు పనులు, ఇరిగేషన్ కెనాల్, రోడ్డు పనులు, చెరువుల్లో పూడిక తొలగింపులు, ఫారెస్టు ఏరియాల్లో పనులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులను గుర్తించాలని సూచించారు. మారుమూల గ్రామాల్లో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుందనీ, ఆయా ప్రాంతాలను గుర్తించి పనులు కల్పించాలని కోరారు. కొన్ని జిల్లాలలో ఉపాధి పనులు, కూలీల హాజరు శాతం బాగున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో పనితీరు మెరుగుపడాలని సూచించారు. క్షేత్ర సాయిలో పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పనితీరు పై సమీక్షించాలని ఆదేశించారు. ఉపాధి పనులు, కూలీల హాజరు విషయంలో పూర్తి బాధ్యత డీఆర్డీఓలదేనన్నారు. ఈ విషయంలో పనితీరు బాగాలేని జిల్లాల నుంచి సంజాయిషీ కోరాలని ఆ శాఖ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. టెలీకాన్ఫరెన్సులో స్పెషల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.