Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెస్ట్ అధ్యాపకులను కొనసాగించాలి
- మంత్రి సబితకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు అధ్యాపకుల మెడికల్ బదిలీల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రజినీకాంత్, కిరణ్, ఎండీ జావేద్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయా బదిలీల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన గెస్ట్ అధ్యాపకులను కొనసాగించాలని కోరారు. జూన్‌లోనే వారికి రెన్యూవల్ ఉత్తర్వులను విడుదల చేయాలని తెలిపారు. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా కాంట్రాక్టు అధ్యాపకుల మెడికల్ బదిలీలు చేపట్టడం వల్ల అనేక కాలేజీల్లో విద్యార్థుల బోధనకు అధ్యాపకుల కొరత ఏర్పడిందని తెలిపారు. ములుగు జిల్లా వాజేడు జూనియర్ కాలేజీలో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల ందరూ బదిలీ అయ్యారని వివరించారు. ఈ క్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఎవరు తరగతులను బోధించాలని ప్రశ్నించారు. అధ్యాపకుల్లేకుంటే ఆ కాలేజీలో విద్యార్థులు ఎలా చేరతారని పేర్కొన్నారు. దీని ఫలితంగా ఆ కాలేజీ మూతపడే పరిస్థితికి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి చాలా కాలేజీల్లో ఉందని తెలిపారు. భవిష్యత్‌లో పేద, గిరిజన, ఆదివాసీ విద్యను దూరం చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇంతవరకు గత, ప్రస్తుత పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెస్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వాటిని విడుదల చేయాలని కోరారు.