Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజ్వేల్, రాష్ట్ర అభివృద్ధి దేశానికి దిక్సూచి
- రాష్ట్ర ప్రజలకు గులాం గిరి చేస్తాం తప్ప, ఢిల్లీ పెద్దలకు కాదు: ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు
నవ తెలంగాణ -గజ్వేల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. గజ్వేల్‌తో పాటు రాష్ట్ర అభివృద్ధి దేశానికే దిక్సూచిగా మారనున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి గజమాల లాంటిదన్నారు. పేదలకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని తెలిపారు. 70 ఏండ్లలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పరిపాలించిన రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గం ఎలా ఉండేదో, ఈ ఏడేండ్లలో గజ్వేల్‌లో ఎన్ని మార్పులు జరిగాయో ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వార్తలు రాసేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారి, వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారు తెలంగాణతో పాటు గజ్వేల్ అభివృద్ధిని చూసి కితాబిస్తున్నారన్నారు. గతంలో గణేష్ నిమజ్జనాలు, బతుకమ్మ పండుగలు ఎక్కడ నిమజ్జనం చేయాలోనని ప్రజలు అయోమయానికి గురయ్యైవారని, కానీ ప్రస్తుతం మిషన్ కాకతీయ ద్వారా అనేక చెరువులు, కుంటలను అభివృద్ధి చేశామని, పుష్కలంగా నీళ్లు ఉన్నాయని వాటిల్లో నిమజ్జనం చేస్తున్నారన్నారు. గజ్వేల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక రింగు రోడ్డు, పార్కులు, రైల్వేస్టేషన్, డ్యాములు తెచ్చారన్నారు. గతంలో గజ్వేల్‌లో యాసంగిలో 7 వేల ఎకరాలు సాగు చేసేవారని, ప్రస్తుతం 17 వేల ఎకరాలను సాగు చేస్తున్నారని తెలిపారు. గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గులాం గిరి చేస్తుంది తప్ప, ఢిల్లీ పెద్దలకు కాదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, మెదక్ జిల్లా పరిషత్ చైర్మెన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మెన్ కృష్ణారెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మెన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మానవ వనరుల అభివద్ధి సంస్థ చైర్మెన్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మెన్ రాజమౌళి, వైస్ చైర్మెన్ జకీర్, మండల పార్టీ అధ్యక్షులు బెండ మధు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.