Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న ఐకేపీ వీఓఏల సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
ఐకేపీ వీవోఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తిం చాలని డిమాండ్ చేస్తూ వారు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె శుక్రవారం ఐదో రోజుకు చేరింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో వీవోఏల నిరవధిక సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మద్దతు తెలిపారు. వీఓఏలను సెర్ఫ్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కడ్తాల్ మండల కేంద్రంలో వీఓఏలు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. వీవోఏలకు పనికి తగ్గ వేతనం కల్పించాలని తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలగౌడ్ అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఐదోవ రోజు కొనసాగుతున్న వీఏవోల దీక్షకు మద్దతు ప్రకటించారు.
చిట్యాల పట్టణ కేంద్రంలో వీఓఏల సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వీఓఏ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మర్రిగూడ మండల కేంద్రంలో, దామరచర్లలో ఐకేపీ, వీఓఏలు నిరవధిక సమ్మెలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఐకేపీ, వీవోఏల సమ్మెకు ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం మద్దతు తెలిపారు.