Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వెంకటేష్
నవతెలంగాణ- బంజారాహిల్స్
ఆస్పత్రి యాజమాన్యం నోటీసులకు భయపడేది లేదని నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షులు ఎం.వెంకటేష్ అన్నారు. పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో 1200 మంది కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ''వన్ అవర్ డెమోనిస్ట్రేషన్'' కార్యక్రమం శుక్రవారం 5వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు. నిమ్స్ యాజమాన్యం గతంలో కార్మికులకు చేసిన వాగ్దానం ప్రకారం వేతనాన్ని రూ.21000కు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న పోరాటాన్ని అణచి వేయడానికి బెదిరింపులకు పాల్పడుతున్నదన్నారు. నిమ్స్ హాస్పటల్ ఎస్మా పరిధిలో ఉందని చెప్పి నోటీసులు ఇప్పించి కార్మికులను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నిమ్స్ యాజమాన్య తాటాకు చప్పుళ్ళకు ఎవరూ భయపడరన్నారు. సమస్యను జటిలం చేయకుండా సామరస్య పూర్వకంగా పరిష్కారించాలని కోరారు. నిమ్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను సీనియార్టీ ప్రకారం పర్మినెంట్ చేయాలని, రిటైరైన కార్మికులకు ఉచితంగా వైద్యం చేయాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, మెట్రో బస్‌పాస్ ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవో 73 వెంటనే సవరించి కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని కోరారు. ఈ మధ్యకాలంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వం జీవోలు సవరించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇ.నరసింహ, నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారించాలని లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.