Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడుస్థాయిల్లో ఆరు రకాల వైద్య సేవలు
- ట్రామా, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్, మాతాశిశు చికిత్స
- రాష్ట్రవ్యాప్తంగా 55 కేంద్రాల ఏర్పాటు
- తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేషన్ (టెరి)కి ప్రభుత్వ శ్రీకారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాల వల్ల వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరింది. ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచే మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. అత్యవసర వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేషన్ (టెరి)ని ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర వైద్యాధికారులు, తమిళనాడు తరహా విధానంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, ఇక్కడి అవసరాలకు అనుగుణంగా, రూపొందించిన నూతన నివేదికపై మంత్రి హరీశ్ రావు ఇటీవల సమీక్షించారు. ప్రకతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశాల్లో ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు సహా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మాతా శిశు అత్యవసర సేవలు, మెడికల్, సర్జికల్ ఎమర్జెన్సీ వంటి ఆరు రకాల ప్రమాద బాధితులకు అవసరమైన వైద్యాన్ని తక్షణం అందించాలని నిర్ణయించింది. తద్వారా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంతవరకు నివారించడమే దీని ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే కేసుల్లో అత్యధికంగా 24 శాతం ట్రామా, రోడ్డు ప్రమాద బాధితులుంటున్నారు. ఆస్పత్రిలో చేరకముందు జరుగుతున్న 35 శాతం మరణాలకు, చేరిన 24 గంటల్లోపు జరిగే 40 శాతం ట్రామా మరణాలకు రక్తస్రావం కారణమవుతున్నది. ప్రీ హాస్పిటల్, ఎమర్జెన్సీ సర్వీసెస్, రిహాబిలిటేషన్, సర్జరీ, స్పెషలిస్ట్, ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ మధ్య సమన్వయం లోపం కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. సకాలంలో స్పందించడం ద్వారా 30 నుంచి 40 శాతం హాస్పిటల్ మరణాలను నివారించొచ్చని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లోని ప్రధాన రహదార్లను కలుపుకునేలా 55 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవి ఏర్పాటు చేసే 55 ఆస్పత్రుల్లో నిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, 17 టీచింగ్ ఆస్పత్రులు, 21 జిల్లా ఆస్పత్రులు, 16 ఏరియా ఆస్పత్రులున్నాయి. రాష్ట్రంలోని అన్ని రహదార్లు కవరయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన వారికి, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్‌కు గురైన వారికి, మాతా శిశు అత్యవసర సేవలు, మెడికల్, సర్జికల్ ఎమర్జెన్సీ సేవలు ఈ ట్రామా కేర్ సెంటర్ల ద్వారా అందిస్తారు. ప్రీ హాస్పిటల్, ఇంట్రా హాస్పిటల్ సేవలుగా విభజించి ఈ సేవలను అందిస్తారు.
ప్రీ హాస్పిటల్ సేవలు..
ప్రీ హాస్పిటల్లో భాగంగా ప్రమాద బాధితులను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చుతారు. ఇందులో భాగంగా ప్రమాద ఘటన స్థలికి వేగంగా 108 అంబులెన్స్ చేరేలా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తారు. అత్యవసర సేవలు అందించే శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది, సీపీఆర్, ఏఈడీ చేసేందుకు వీలుగా వైద్య పరికరాలుంటాయి. ప్రస్తుతం 426 అంబులెన్సులుండగా, 292 వాహనాల్లో ఏఈడీలున్నాయి. మిగతా 133 వాహనాలను త్వరలో ఏర్పాటు చేస్తారు. 108 వాహనంలోకి బాధితుడిని తీసుకోగానే అతడి ఆరోగ్య పరిస్థితిని వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలు సమీపంలోని ఆస్పత్రికి చేరగానే అత్యవసర విభాగం వైద్యులు అవసరమైన చికిత్సను అందించేందుకు ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంటారు.
ఇంట్రా హాస్పిటల్ కేర్
ట్రామా కేర్ ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల్లో నూతన మార్పులు చేయనున్నారు. అంబులెన్స్ సులభంగా వచ్చి పోయేలా ఏర్పాటు చేయడంతోపాటు, దిగగానే ఎమర్జెన్సీ సేవలు అందేలా సదుపాయం కల్పిస్తారు. ఎమర్జెన్సీ విభాగం సులువుగా గుర్తించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ఓపీ సేవలను కొనసాగిస్తారు. కుర్చీలు, స్ట్రెచర్లు, ట్రాలీలు, వీల్ చైర్లు వంటివి ఎమర్జెన్సీ వద్ద అందుబాటులో ఉంచుతారు. క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లుగా మార్చుతారు. ఎమర్జెన్సీ విభాగంలో డెడికేటెడ్ ట్రయాజ్‌లో నాలుగు క్లినికల్ మేనేజ్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల సూచీలతో విభజిస్తారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి తీవ్రత ఆధారంగా అవసరమైన చికిత్సను అందించేందుకు దోహదపడుతుంది. ట్రయాజ్‌లో మల్టీ పారామీటర్ మానిటర్లు, మెడికల్ గ్యాస్ ఔట్ లెట్లు, ఇతర వైద్య సదుపాయాలుంటాయి. ఐపీహెచ్ఎస్-ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం, 5000 చదరపు అడుగుల్లో 10 పడకల ఈఎండీ ఏర్పాటు చేస్తారు. ల్యాబ్‌లు, సర్జికల్ థియేటర్లు కూడా ఇందులో ఉంటాయి. ఎమర్జెన్సీ విభాగంలో టీచింగ్ ఆస్పత్రుల్లో 30 బెడ్లు, టీవీవీపీ ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని బట్టి 5,10,15,20 బెడ్లను ఎమర్జెన్సీకి కేటాయిస్తారు. ఆటోక్లేవ్ మిషన్, మొబైల్ ఎక్స్‌రే, ఈ ఫాస్ట్, సక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్రిలేటర్స్, సీ ఆర్మ్, ఆల్ట్రాసోనోగ్రఫీ, ఆల్ట్రా సౌండ్, సీటీ స్కాన్, వెంటిలేటర్లు, ఓటీ ఎక్విప్మెంట్ వంటి అవసరమైన, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకుంటారు. మొత్తం 7 విభాగాలకు చెందిన స్పెషాలిటీ వైద్యులు, 7 విభాగాల నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఒక్కో ట్రామా కేర్ సెంటర్లో ఉంటారు. మొదటి స్థాయిలో 237 మంది, రెండోస్థాయిలో 101 మంది, మూడోస్థాయిలో 73 మంది ఉండి సేవలందిస్తారు. వారికి జిల్లా స్థాయిలోనే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్లను అందజేస్తారు.కాగా ట్రామా కేంద్రాల ద్వారా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.