Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రం ప్రారంభం
- ఇండో- పసిఫిక్ తీర ప్రాంత దేశాలతో సత్సంబంధాలు అవసరం :
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్
- యుద్ధాలు సమస్యలు పరిష్కరించలేవు.. : కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఓఎస్డీ, అంబాసిడర్ రాజశేఖర్
నవ తెలంగాణ- ఓయూ
''సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఓయూ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా ఇండో ఫసిఫిక్ అధ్యయన కేంద్రం చేరింది. సామాజిక శాస్త్రాలు మొదలు.. శాస్త్ర సాంకేతిక రంగాలు, విదేశీ భాషల వరకు విద్యా బోధనలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని'' రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ప్రపంచ స్థాయి సామాజిక, ఆర్థిక, సమకాలీన స్థితిగతులపై అధ్యయనం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఇండో-పసిఫిక్ అధ్యయన కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విస్తారమైన ఇండియన్ - పసిఫిక్ మహా సముద్ర తీర దేశాల మధ్య సత్సంబంధాలపై విస్తృత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత సమాజంలో సేల్స్ మెన్ నుంచి అంబాసిడర్ దాకా అంతర్జాతీయ వ్యవహారాలపై కనీస అవగాహన తప్పనిసరిగా మారిందని వ్యాఖ్యానించారు. ఇండో పసిఫిక్ తీర ప్రాంత దేశాలతో సత్సంబంధాలు, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక మైత్రి అవసరమని, అప్పుడే అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించొచ్చని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ వ్యూహాత్మక కేంద్రంగా మారనుందన్నారు. తూర్పు, పశ్చిమ దేశాలకు మధ్య వారధి అవుతుందని వివరించారు. అందుకే లోతైన, నాణ్యమైన పరిశోధనల ద్వారా ఇండో పసిఫిక్ సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చన్నారు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ తర్వాత ఇండో పసిఫిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలో రెండో కేంద్రంగా నిలిచిందని చెప్పారు. ఓయూ ఇప్పుడిప్పుడే తిరిగి పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోందన్న ఆయన నూతన అధ్యయన కేంద్రాలు ప్రపంచ గుర్తింపు తెస్తాయనటంలో సందేహం లేదన్నారు.
ఇండో పసిఫిక్ కేంద్రం ప్రారంభించే చారిత్రక కార్యక్రమానికి హాజరు కావటం ఆనందంగా ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఓఎస్డీ, అంబాసిడర్ రాజశేఖర్ అన్నారు. దేశ అభివృద్ధిలో విదేశీ వ్యవహారాలు ఎంతో ముఖ్యమని చెప్పారు. మూడు శతాబ్ధాలుగా యూరప్, అమెరికా దేశాల పరిణామక్రమాన్ని వివరించిన ఆయన అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంత దేశాలేనని తెలిపారు. అందుకే ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రానికి ప్రాముఖ్యత ఉందని వెల్లడించారు. యుద్ధాలు సమస్యలు పరిష్కరించలేవనే విషయాన్ని సమకాలీన పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చని, వైరుధ్యాలను వదిలి సత్సంబంధాల దిశగా అభివృద్ధి పంథాను ఎంచుకోవాలని అన్నారు. ఉస్మానియా ప్రారంభించిన ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రానికి కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ అవసరమైన తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. నాణ్యమైన పరిశోధనల ద్వారా ఓయూని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
మాజీ ప్రధాని పివి.నరసింహ్మారావు లుక్ ఈస్ట్ పాలసీ ద్వారా భారత్‌కు ఎంతో మేలు కలిగిందని, ప్రస్తుతం భారత్ అభివృద్ధి దిశగా సాగటానికి ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలే కారణమని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ అన్నారు. గతంలో ఓయూలో ఓషియన్ స్టడీస్ కేంద్రం ఉండేదని, నిధుల నిలుపుదల కారణంగా అది మూతపడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రం ప్రారంభించటం ద్వారా తిరిగి ఉస్మానియా తన వైభవాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మార్పు, విదేశాంగ విధానం, భద్రత, పర్యావరణ, వాతావరణ మార్పులు సహా వివిధ అంశాలపై అన్వేషణలో భాగంగా ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులు, నిపుణులు, విధానకర్తలు, విద్యార్థులు, పరిశోధకులకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుందని వివరించారు.
శాసనమండలి సభ్యులు సురభి వాణీదేవి మాట్లాడుతూ.. నాటి ప్రధాని పీవి నరసింహ్మారావు ఆసియా- పసిఫిక్ దేశాల సంబంధాలను బలోపేతం చేయటానికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. దేశాల మధ్య
సత్సంబంధాల ద్వారానే ప్రపంచ శాంతి సాధ్యమవు తుందని వ్యాఖ్యానించారు. ఉస్మానియాలో ప్రారం భించిన ఇండో పసిఫిక్ కేంద్రానికి మంచి భవిష్యత్తు ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొ. ఆర్. లింబాద్రి అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. పి.లక్ష్మీనారాయణ, ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జె.ఎల్.ఎన్ రావు, ప్రజాసంబంధాల అధికారి ప్రొఫెసర్ ప్యాట్రిక్ ప్రిన్సిపాల్స్, ఆయా విభాగాల డైరెక్టర్లు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.