Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొండాపూర్ మండలంలో రైతుల ఆందోళన:తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పేదలకు అసైన్డ్ చేయబడిన భూములను ధరణీ వెబ్సైట్లో చేర్చి సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మహ్మాదాపూర్ గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలో సాగర్ పాల్గొని మాట్లాడారు. మన్మోహన్సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో మహ్మాదాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 22లో 188 మంది పేదలకు 32 ఎకరాల భూమిని పేదలకు అసైన్డ్ చేశారని తెలిపారు. రైతులకు పట్టాలు పంపిణీ చేసి పాసుపుస్తకాలు కూడా జారీ చేయబడ్డాయని తెలిపారు. కాగా, ఆ భూముల వివరాల్లో రైతుల పేర్లు ధరణి పోర్టల్లో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అసైన్డ్ చేసినప్పటి నుంచి రైతులు భూమిని సాగు చేసుకుంటూ కబ్జాలో ఉన్నారని తెలిపారు. 12 ఏండ్లుగా భూమిని నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతుల పేర్లను ధరణీలో చేర్చకుండా అన్యాయం చేయడం సరైంది కాదన్నారు. పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు లేని కారణంగా రైతు బంధు, రైతు బీమా, పంట రుణాలు, పంట నష్టం, ఇతర రాయితీలేవీ అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్ల్ల తరబడిగా భూమిని నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయని పక్షంలో రైతు సంఘం ఆధ్వ ర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కార్యక్ర మంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే.రాజయ్య, ఉపాధ్యక్షులు బి.యాదవరెడ్డి, నాయకులు అమృ తమ్మ, సుశీల, చంద్రమ్మ, మనెమ్మ, యాదయ్య, రాములు, కమలమ్మ, రాములమ్మ పాల్గొన్నారు.