Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది మంది పొరుగుసేవల ఉద్యోగులపై వేటు
- బియ్యం మార్పిడికి మిల్లర్లకు ఆదేశం
- టెక్నికల్ అసిస్టెంట్లతో సివిల్ సప్లైస్ చైర్మెన్ రవీందర్ సింగ్ సమీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హాస్టళ్లు, స్కూళ్లకు నాణ్యత లేని బియ్యం సరఫరాపై సర్కారు సీరియస్ అయింది. ఈ మేరకు బాధ్యులుగా గుర్తించిన ఎనిమిది పొరుగుసేవల సిబ్బందిని తొలగించింది. అదే సమయంలో సరఫరా చేసిన నాణ్యత లేని బియ్యాన్ని వెనక్కి తీసుకుని వాటి స్థానంలో సన్నబియ్యాన్ని 45 రోజుల్లో అందజేయాలని ఆదేశించింది. పలు ఫిర్యాదుల నేపథ్యంలో శనివారం పౌరసరఫరా సంస్థ చైర్మెన్ రవీందర్ సింగ్ 96 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, భారత ఆహార సంస్థ రిటైర్డ్ ఉద్యోగులతో సన్నబియ్యంపై హైదరాబాద్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొంత మంది అమానవీయంగా స్కూళ్లకు, హాస్టళ్లకు నాణ్యత లేని బియ్యం సరఫరా చేసినట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దీంతో ఎనిమిది జిల్లాలకు చెందిన మిల్లర్లు నిర్దేశించిన గడువులోగా బియ్యాన్ని మార్చాలని ఆదేశించారు. ఉద్యోగులు, మిల్లర్లు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలనీ, వారిపై నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎలాంటి ఒత్తిడి, ప్రభావానికి గురి కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటే పేద విద్యార్థులు పౌష్టికాహార లోపం, రక్తహీనతకు గురి కాకుండా బలవర్థకమైన సన్నబియ్యం సరఫరా చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల్లో పౌష్టికాహారలోపాన్ని నివారించేందుకు వీలుగా ప్రభుత్వం ఏడాదికి 65 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సేకరిస్తున్నదని ఆయన తెలిపారు.