Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునితా లక్ష్మారెడ్డికి అభినందనల వెల్లువ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆపదలో ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలి ప్రాణాలు, నగలను కాపాడిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు ఒక కిలోమీటర్ మేర ఆటోను చేజ్ చేసి.. ఆ ఆటో డ్రైవర్‌ను, అతనితో ఉన్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శనివారం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన తర్వాత .. ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చైర్పర్సన్ తిరిగి వస్తున్నారు. అప్పటికే ఓ మహిళను ట్రాప్ చేసిన ఆటో డ్రైవర్, అతని సహాయకురాలు సరిగ్గా బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో ఆటోను రోడ్డు పక్కకి ఆపి.. ఆ మహిళా ప్రయాణికురాలి గొంతుపై కత్తిపెట్టి పుస్తెల తాడు లాక్కున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి వాహనాన్ని చూసి ఆ మహిళ బిగ్గరగా కేకలు వేసింది. ఆ ఆర్తనాదాలు విన్న చైర్పర్సన్ కాన్వారుని ఆపడంతో.. ఆటో డ్రైవర్, అతని సహయకురాలు పారిపోయేందుకు ప్రయత్నించారు. బాధిత మహిళ నుంచి వివరాలు సేకరిస్తుండగానే ఆటో డ్రైవర్ స్పీడు పెంచి ఆటోలో పరారయ్యాడు. దీంతో వెంటనే తన సిబ్బందితో కాన్వారు స్పీడు పెంచిన సునీతా లక్ష్మారెడ్డి ఆటోను సుమారు ఒక కిలోమీటర్ పాటు చేజ్ చేసి ఆటో డ్రైవర్‌ను, అతడి సహాయకురాలిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పుస్తెల తాడును తీసుకుని బాధిత మహిళకు అప్పగించారు. అనంతరం తన సిబ్బంది సాయంతో ఆటో డ్రైవర్, మహిళలను స్థానిక పోలీస్ సిబ్బందికి అప్పగించారు. బాధితురాలికి సునీతా లక్ష్మారెడ్డి ధైర్యం చెప్పారు.ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. నిందితులు సంగారెడ్డి జిల్లా తాళ్లపళ్లకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.