Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పాఠ్యాంశంలోనుంచి డార్విన్ సిద్ధాంతం తొలగింపును ఉపసంహరించుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, కార్యదర్శి నామాల ఆజాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాస్త్రీయ ఆలోచనలను అణచివేసే కుట్రలో భాగంగానే పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ పేరుతో జీవ పరిణామ క్రమం పాఠ్యాంశాన్ని ఎన్సీఈఆర్టీ తొలగించిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విద్యార్థుల్లో నింపడం కోసమే ఇప్పటికే 12వ తరగతి చరిత్ర పుస్తకం నుంచి మొఘలుల పాలనకు సంబంధించిన పాఠాలను తొలగించిందని గుర్తు చేశారు. వాస్తవాలను విద్యార్థులకు అందించే శారీరక పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ 1,800 మందికిపైగా శాస్త్రవేత్తలు, సైన్స్ అధ్యాపకులు, మేధావులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ రాశారని తెలిపారు. సైన్స్ పాఠ్యాంశాలను తొలగించి మూఢవిశ్వాసాలు లేదా ఆర్ఎస్ఎస్ భావాలను పాఠ్యాంశాల్లో చేర్చడమంటే దేశాన్ని అబద్ధపు, అంధకారంలో నెట్టడమేనని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.