Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత కక్షతోనే వెంటాడుతున్న కేంద్రం :
సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాంకేతిక అంశంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ వేధిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. గాంధీ కుటుంబ త్యాగాలను మర్చిపోవద్దని కోరారు. వ్యక్తిగత కక్షతోనే రాహుల్‌గాంధీని కేంద్ర ప్రభుత్వం వెంటాడుతున్నదని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్ష దాగుందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక్‌సభ స్పీకర్ ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఆ వెంటనే ఎంపీగా ఉన్న నివాసాన్ని ఖాళీ చేయమని హుకుం జారీచేయడం అంతా వ్యక్తిగత కక్షలాగా అనిపిస్తోందని తెలిపారు. ఈ వ్యవహారంలో మోడీ, అదానీల చేతికి మట్టి అంటకుండా కేవలం సాంకేతిక అంశాలను పైకి చూపించి రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దుచేసి అధికారిక నివాసం నివాసం నుండి ఖాళీ చేయించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తాత ముత్తాతలు బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారని జైలుకు వెళ్లారని వివరించారు. జవహర్లాల్ నెహ్రూ సైతం అనేక త్యాగాలు చేశారని రాహుల్ గాంధీ నాయనమ్మ ఇంది రాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రాణాల ర్పించారని తెలిపారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీపై వ్యక్తిగత కక్షతో సాంకేతిక అంశాలను చూపించి వేధిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను సైతం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బీజేపీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని నారాయణ హెచ్చరించారు.