Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు
- ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్లకు అనుమతి
నవతలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో ప్రస్తుత సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతి లభించనుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి, కే.తారక రామారావు జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్‌ని కేటాయించడంతోపాటు దానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజాగా సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను చేపట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఫర్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్‌ను ప్రారంభించి, 100 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లను స్వీకరించనున్నారు. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ జిల్లా మెడికల్ కాలేజీకి అనుమతిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది.
హరీశ్ రావు హర్షం
100 ఎంబీబీఎస్ సీట్లతో రాజన్న సిరిసిల్లా జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి రావడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. తొమ్మిది మెడికల్ కాలేజీ లకు గాను ఇప్పటి వరకు ఏడింటికీ అనుమతి వచ్చినట్టు ఆయన తెలిపారు. 24 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం విజయ వంతంగా ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు.