Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి
- తెలంగాణ ఆల్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి యాటాల సోమన్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, 55ఏండ్ల వయస్సుపైబడిన హమాలీలకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ఆల్ హమాలీ ఫెడరేషన్ (సీిఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి యాటాల సోమన్న డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మార్కెట్ హామాలీ వర్కర్స్ సమావేశం సీఐటీయూ నాయకులు శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ప్రభుత్వ గోదాముల్లో పని చేస్తున్న సివిల్ సప్లైస్, జీసీసీ, బేవరేజెస్, ఎఫసీఐ హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఐఎల్ఓ తీర్మానం ప్రకారం 50 కేజీల బరువులను నిషేధించాలని అన్నారు. హమాలీలందరికీ ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పీిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ హక్కుల అమలు, ఐకేపీ హమాలీలకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలని చెప్పారు. హమాలీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29న 'చలో హైదరాబాద్' లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో హమాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది హమాలీలు పనిచేస్తున్నారని, ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు, సివిల్ సప్లై, ఎఫసీఐ, జీసీసీ, మార్కెట్ యార్డ్, కోల్డ్ స్టోరేజ్, సిమెంట్ గోదాములు, కూరగాయలు, పండ్ల మార్కెట్, రైస్, ఆయిల్, దాల్ మిల్స్, కంకర క్వారీలు, రైల్వే, ఆర్టీసీ స్టోర్ వర్కర్స్, ఐకేపీ హమాలీలు, బేవరేజ్ హమాలీలు అనేక రంగాల్లో పనిచేస్తున్న వారికి పని భద్రత వంటి చట్టబద్ధహక్కులు అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. హమాలీల రక్షణ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలనే డిమాండ్లపై నిర్వహిస్తున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమంలో హమాలీలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జి.నరసింహ, గోపాల్, వెంకటేశ్, చిన్న, జి.ఆంజనేయులు, రామకష్ణ, జి.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.