Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్వి.రమ
- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె
నవతెలంగాణ-కందుకూరు, తలకొండపల్లి
వీవోఏలు సమస్యలు పరిష్కరించే వరకూ పోరాడుతామని తెలంగాణ ఐకేపీ వీవోఏల సంఘం(సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్వి.రమ అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా వీఓఏలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. శనివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు, తలకొండపల్లి మండల కేంద్రాల్లో కొనసాగుతున్న వీవోఏల నిరవధిక సమ్మెకు రమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో వీవోఏలు పనిచేస్తున్నారన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఓఏలకు సీఐటీయూ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తుందన్నారు. అక్కడక్కడ బీఆర్ఎస్ నాయకులు సమ్మె జరగకుండా ఆడ్డుకుంటున్నారని విమర్శించారు. గ్రామస్థాయిలో 19 ఏండ్లుగా పనిచేస్తున్న వీవోఏలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వీవోఏలలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారన్నారు. మహిళల సమస్యలను దృష్టిలో పెట్టుకునైనా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ జి.కవిత, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అలువాల రవికుమార్, సీఐటీయూ మహేశ్వరం మండల కన్వీనర్ ఏర్పుల శేఖర్, కందుకూరు మండల కన్వీనర్ బుట్టి బాలరాజు, శివలీలా, సరస్వతి, సంగీత, లక్ష్మి, పద్మ, రామచంద్రారెడ్డి, రమేష్, రవి, వీవోఏలు పాల్గొన్నారు.