Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్రూమ్ సాధన కోసం చివరకంటా పోరాటం
- గుండెపోటుతో మృతి
నవతెలంగాణ-జనగామ
సొంత ఇల్లు లేదు.. కనీసం జాగా లేదు.. ఇంటి కిరాయి కట్టలేక.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై.. డబుల్ బెడ్రూమ్ కోసం పోరాడి అలసిపోయిన సగటు మైనార్టీ జీవి చివరకు వారి పవిత్ర పండుగ రంజాన్ రోజే ప్రాణం కోల్పోయాడు.. జనగామ పట్టణం మైనార్టీ కాలనీలో గత 30 సంవత్సరాలుగా కిరాయికి ఉంటున్న ఎండి గౌస్ పాషా గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
పాషా 30 ఏండ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. గతంలో బాణాపురంలో ఇందిరమ్మ ఇల్లు, స్థలం కోసం.. ప్రస్తుతం డబుల్ బెడ్ కోసం పోరాడాడు. ఇండ్ల సాధన పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇన్నేండ్లయినా తమకు ఇల్లు మంజూరవుతుందో లేదోనని తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబీలకు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంజాన్ పండుగ రోజే ఇంటి పెద్ద మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ద్ణుఖసాగరంలో మునిగిపోయారు. పాషది ఇద్దరు కుమారులు, కోడలు, ఇద్దరు మనవరాండ్లు.. భార్య.. ఉమ్మడి కుటుంబం.
ఈ విషయం తెలిసి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కమిటీ అధ్యక్షులు కళ్యాణం లింగం, నాయకులు, కార్యకర్తలు మైనార్టీ కాలనీలోని వారి ఇంటికి వెళ్లి పాషా భార్య ఫాతిమాను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం తీవ్ర ద్ణుఖంలో ఉందన్నారు. పాషా మరణం పేదల ఇండ్ల స్థలాల సాధన పోరాటానికి తీరని లోటని అన్నారు. పాషా మరణానికి ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలని, వారికి తక్షణం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే లబ్దిదారులు అనేకమంది సొంత ఇంటి కల నెరవేరకనే కిరాయిండ్లలోనే ప్రాణం వదిలిన ఘటనలు అనేకం జరిగాయని చెప్పారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పేదల ఇండ్ల స్థలాల జీవన్మరణ సమస్యను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ సభ్యులు పొన్నాల ఉమా, పిట్టల శారద, కొలిపాక శోభ, బొల్లాపల్లి ఇందిరా, వల్లాల పద్మ, వేణు తదితరులు ఉన్నారు.