Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసి ముద్దైన ధాన్యం
- ఆరబెట్టేందుకు అవస్థలు
- తూకం నెమ్మదిగా కొనసాగుతుందని ఆరోపణ
- ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
- రెండ్రోజులుగా వడగండ్లు, ఈదురుగాలలతో వర్షం
- మల్యాలలో పిడుగుపాటుకు గీత కార్మికుడు మృతి
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్/ విలేకరులు
కాయ కష్టం చేసి పంట పండితే.. కండ్ల ముందే వర్షం పాలైంది. రెండ్రోజులుగా వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం, ఈదురు గాలులు రైతులను నట్టేట ముంచాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవకాశాలూ లేకపోవడంతో అన్నదాతలు అవస్థ పడుతున్నారు. కనీసం టార్పారిన్లు వేసైనా కాపాడాల్సిన అధికారులు పత్తాలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడమూ పంట తడవడానికి కారణమైంది. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో తాటిచెట్టుపై పిడుగు పడటంతో పక్కనే ముంజలు విక్రయిస్తున్న గీతకార్మికుడు ముత్యం మల్లేష్(65) అక్కడికక్కడే మరణించాడు.
ఏప్రిల్ ఒకటో తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పిని ఆలస్యంగా 10వ తేదీన ప్రారంభించారు. శుక్రవారం అకాలంగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కాంటాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయని, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగుల, లారీల కొరతతో ఇబ్బంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొనుగోలులో వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు.
నల్లగొండ జిల్లాలో ఐకెేపీ138, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 140 మొత్తం 278 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 268 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నేటికీ 60,2508 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. 3408 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంది. కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. పలు రకాల కారణాలను చూపుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, దళారుల నియంత్రణలో చర్యలు లేకపోవడంతో రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తుంది.
ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఓ వైపు తూకంలో నష్టం చేస్తుండగా.. మరోవైపు మిల్లర్లు కోతను విధిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లారీల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. బస్తాకు నిర్ణయించిన ధరను చెల్లిస్తే రవాణా చేస్తామని బహిర్గతంగా చెబుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. దాంతో చేసేదేమీ లేక లారీ యజమానులు బస్తాకు నిర్ణయించిన రెండు నుంచి మూడు రూపాయలను చెల్లించి రవాణా చేయించుకోవలసిన దుస్థితి నెలకొంది. నాంపల్లిలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో తేమశాతం తక్కువగా ఉందని సాకు చూపుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి ప్రకటించిన మద్దతు ధరను చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా అధికారులు కొనుగోలులో వేగం పెంచాలని రైతులు వేడుకుంటున్నారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
బండా శ్రీశైలం - రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు
జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ కొనుగోలు చేయాలి. తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలి. దళారులను అరికట్టాలి.
జిల్లాల్లో వర్షం..
చౌటుప్పల్ మండలంలో
శుక్రవారం రాత్రి కురిసిన ఈదురు గాలులకు, వర్షానికి ఎస్. లింగొటం గ్రామంలో కోళ్లఫారం కూలిపోయింది. అందులో ఉన్న 300 కోళ్లు చనిపోయాయి. అదే విధంగా దండు మల్కాపురం గ్రామంలో గొర్రెలపై ప్రహరి గోడ కూలి 20గొర్రెలు చనిపోయాయి. మరికొన్ని గొర్రెలు గాయపడ్డాయి. గొర్రెల కాపరిని ఆదుకోవాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అయోధ్య యాదవ్ కోరారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 300.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా నకిరేకల్ మండలంలో 46.2, పీఏపల్లిలో 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో మిర్చి కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. ఓ వైపు పట్టాలు కప్పుతుండగా.. మరోవైపు ఈదురు గాలలకు అవి ఎగిరిపోయాయి. కోతకొచ్చిన వరి నేల వాలింది. మామిడికాయలు మొత్తం రాలిపోయాయి. కరెంటు స్తంభాలు, చెట్లు, రేకుల షెడ్లు కూలాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఉరుములు మెరుపులు పిడుగులతో గాలివాన కురిసింది. మండలంలోని పసరలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పలు ఇండ్ల కప్పులు ఎగిరిపోగా టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కాలిపోయాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో శనివారం ఒక్కసారిగా వర్షం కురవడంతో ఇటు జాతీయ రహదారుల పైన చెట్లు విరిగిపడటంతో పాటు కోతకు వచ్చిన వరి పూర్తిగా రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జాతీయ రహదారిపై భారీ వక్షాలు సైతం నేలకు ఒరిగాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం సాయంత్రం 6గంటలకు సుమారు 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆయా గ్రామాల్లో పెద్దఎత్తున ఆరబోయిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. వరిపొలాలన్నీ వడగళ్ల మంచుతో నిండిపోయాయి. మొక్కజొన్న నేలవాలిపోగా.. మామిడి పెద్దఎత్తున రాలిపోయింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడి పలు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. కరీంనగర్-రామగుండం జాతీయ రహదారిపై చెట్లు విరిపడటంతో రాత్రి 9గంటల వరకూ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, గర్రెపల్లి, జగిత్యాల జిల్లా మల్యాల, కొండగట్టు, రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట, చందుర్తి, బోయిన్పల్లి మండలాల్లో వరి పంటకు తీవ్ర నష్టమే వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం కోసం తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోగా, వడగండ్ల కూడా పెద్దఎత్తున పడ్డాయి. గర్రెపల్లిలో పంట పొలాలతోపాటు ఇంటి పైకప్పులు లేచిపోవడంతో పాటు ఇన్ని ఇండ్ల గోడలు కూలిపోయాయి. కరీంనగర్ నగరంలో హోర్డింగ్లు ప్రమాదకరంగా వంగిపోయాయి.