Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుతో కన్నుమూత
- నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
- కేసీఆర్, జగన్ సహా పలువురి సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సుప్రసిద్ధ సాహితీవేత్త, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, మహా మహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి (80) శుక్ర వారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడు తున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆస్పత్రి ఎదురుగా ఉన్న జడ్జెస్ కాలనీలో రుక్మిణి అపార్టుమెంట్లో ఆయన నివసిస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని సరూర్‌నగర్ అవేర్ ఆస్పత్రిలో ఉంచారు. అమెరికాలో ఉన్న ఆయన కుమారులు హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్నారు. ఆదివారం ఉదయం మలక్‌పేటలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వెల్వర్తి గ్రామంలో సామాన్య చేనేత కుటుంబంలో 1943, సెప్టెంబర్ 12న ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పో యాడు. చెల్లెలు, తమ్ముడికి ఇతడే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మినరసింహ సంస్కృత విద్యాపీఠంలో సురవరం ప్రతాపరెడ్డి, ఎం నరసింగరావుల సహాయంతో చేరాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అతనికి గురువు. హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌లో గల సంస్కృత కాలేజీలో డీఓఎల్, బీఓఎల్ వ్యాకరణం చదివారు. కఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహ శాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం నేర్చుకున్నారు. వివేక వర్ధిని కాలేజీలో తెలుగు పండితుడిగా చేరాడు. బీఏ తెలుగు పండిత శిక్షణ పూర్తయ్యాక ఎంఏ తెలుగు, సంస్కృతం, పూర్తి చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు లో 1967లో లెక్చరర్‌గా చేరారు. ఆ విద్యార్థులకు తెలుగు, సంస్కృతం రెండు సబ్జెక్టులనూ బోధించా రు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) తెలుగు శాఖలో 1973లో చేరాడు. ఆచార్య బిరుదు రాజు రామరాజు సలహాతో తెలుగులో భాస్కర రామా యణం మీద పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందా రు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 17 ఏండ్లు బోధ న, పరిశోధనలను నిర్వహించారు. 2002లో ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితుల య్యారు. 2011లో తిరుమల తిరుపతి దేవ స్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పని చేశారు. సంస్కతాంధ్ర భాషల్లో ఆయన అపార మైన కృషి చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి నా భాషా సాహిత్యంలో ఆయన సుప్రసిద్ధ సాహితీ వేత్త గా, ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి స్థాయి కి ఎదిగారు. ఆయన మరణం పట్ల తెలంగాణ, ఏపీ సీఎంలు కె చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి సహా పలువురు సంతాపం ప్రకటించారు.
భాషా, సాహిత్య రంగాలకు తీరనిలోటు : సీఎం కేసీఆర్
సుప్రసిద్ధ సాహితీవేత్త, ప్రముఖ తెలుగు సంస్కృత భాషా పండితుడు, ఆచార్య రవ్వా శ్రీహరి మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతాపాన్ని ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన రవ్వా శ్రీహరి.. సామాన్య కుటుంబం లో జన్మించి, కృషి పట్టుదలతో భాషా సాహిత్య రంగంలో అంచెలంచలుగా ఎది గారని తెలిపారు. లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, వైస్ చాన్సలర్‌గా పలు పదవులను చేపట్టి అత్యు న్నత శిఖరాలను అధిరోహించా రని పేర్కొన్నారు. ఆయన జీవి తం స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. ఆయ న మరణం భాషా, సాహిత్య రంగాలకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యు ల కు సిఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
తెలుగు సాహిత్యానికి పూడ్చలేని లోటు : జూలూరు గౌరీశంకర్
సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చి తెలుగు సాహిత్యంలో మహో న్నత శిఖరంగా ఎదిగిన మహా మహోపాధ్యాయుడు రవ్వా శ్రీహరి మరణం పట్ల తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ సంతాపం ప్రకటించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సంస్కృత పాఠశాలలో చదువుకుని తెలుగు సాహిత్యానికే ప్రొఫెసర్‌గా, ద్రావిడ విశ్వవిద్యాలయం వీసీగా అంచెలంచలుగా ఎదిగారని తెలిపారు. భాషా శాస్త్రవేత్త రవ్వా శ్రీహరి మరణం పట్ల తెలంగాణ సాహితీ అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన, ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.