Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దార్విన్ సిద్ధాంతం తొలగింపుపై ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీబీఎస్ఈ పదో తరగతి పాఠ్యాంశాల నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడమంటే విద్యలో మూఢత్వాన్ని పెంచడమేనని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) విమర్శించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, టి నాగరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యారంగంపై ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని విమర్శించారు. ఇటీవల 12వ తరగతి పాఠాలు తొలగించిన ఎన్సీఈఆర్టీ తీరు ఈ దేశంలో సైన్స్ విద్యకు, దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విద్యను మూఢత్వంలోకి నెట్టి కాషాయీకరణ పెంచే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. జాతీయోద్యమ వీరులు, హిందూ, ముస్లిం ఐక్యతను, గాంధీ హత్యవంటి సబ్జెక్టులు తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడం వంటి చర్యల వల్ల సైన్స్ పాఠ్యాంశాలను మళ్లీ పాత పద్ధతిలో విశ్వాసాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డార్విన్ పాఠాన్ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ''సైన్స్, చరిత్ర లేకపోతే ఈ దేశానికి భవిష్యత్ లేదు'' అని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఈ దేశ చరిత్రను, పాఠ్యాంశాలను మార్చి తన భావజాలాన్ని తీసుకుని రావడాన్ని ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు.