Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. హోం మంత్రి నివాసంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయపద్దతిలో వారు ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని తన వెంట వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ఆచరించే పవిత్ర ఉపవాస దీక్షలు, జరిపే దైవ ప్రార్థనలు, ఆసందర్భంగా పెంపొందే క్షమాగుణం, కరుణ, ప్రేమ తదితర ఆధ్యాత్మిక భావనలతోపాటు రంజాన్ పండుగ ప్రాశస్త్యం గురించి సీఎం స్మరించుకున్నారు. ఇవే అంశాలపై తన వెంట వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలతో ఆయన కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పలువురు మత పెద్దలు, సామాన్యులను పేరు పేరునా పలకరించి, అలారు బలారు తీసుకుని వారికి సీఎం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఉద్యమకాలం నుంచి నేటి వరకు తనతో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్త సత్తార్ గుల్షనీని పేరు పెట్టి పిలిచి దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజరు కుమార్, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు మసీఉల్లాఖాన్,సలీం, రవీందర్ సింగ్, మేడే రాజీవ్ సాగర్, సీనియర్ నేతలు మొయిత్ ఖాన్, రాయిడన్ రోచ్ పాల్గొన్నారు.