Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టిజన్స్, ఆన్మెన్డ్ కార్మికులకు యాజమాన్యం హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్స్, ఆన్మెన్డ్, పీస్‌రేట్ కార్మికులకు యాజమాన్యం హెచ్చరికలు జారీచేసింది. సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ట్రాన్స్‌కో, జన్కో చైర్మెన్, మేనేజింగ్
డైరెక్టర్, టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మెన్,మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్లకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె ఈశ్వర్రావు, జే ప్రసాద్‌రాజు శుక్రవారం సమ్మె నోటీసును అందచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో డిస్కమ్‌ల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్‌ను కన్వర్షన్ చేయాలని వారు ఈ సందర్భంగా ఉన్నతాధికారులను కోరారు. ఆర్టిజన్స్, ఓ అండ్ ఎమ్ ఉద్యోగులు చేస్తున్న పనులనే ఆన్మెన్డ్ కార్మికులు చేస్తున్నారని తెలిపారు. వారికి సంస్థలో గుర్తింపే లేదని పేర్కొన్నారు. ఈ కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి సంస్థకు సేవలు చేస్తున్నారనీ, ఈ ఆన్మెన్డ్ కార్మికులందరినీ ఆర్టిజన్స్‌గా గుర్తించి వారికి వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని పట్టించుకోని యాజమాన్యం సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీచేయటం గమనార్హం.