Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై అదానీ కన్ను!
- డోర్నకల్- మిర్యాలగూడ వరకు రైల్వేలైన్‌కు సర్వే
- కోల్పోనున్న భూములు, ప్లాట్లు, ఇండ్లు
- సర్వేను అడ్డుకుంటున్న ఖమ్మం నిర్వాసితులు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత ఆత్మీయుడు గౌతమ్ అదానీ సామ్రాజ్యం ఖమ్మం జిల్లా వరకొచ్చింది.. గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, రోడ్లు, నూతన రైలుమార్గాలు, పవర్ ప్రాజెక్టుల రూపంలో ప్రభుత్వ, ప్రయివేట్ భూములు, ఆస్తులను కారుచౌకగా కాజేస్తున్న అతను.. తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై కన్నేసినట్టు తెలుస్తోంది. దీన్ని నయానో భయానో హస్తగతం చేసుకుంటే విద్యుదుత్పత్తికి కావాల్సిన బొగ్గు, ఇతరత్రా ఖనిజాలను సరఫరా చేసేందుకు నూతన రైల్వే మార్గం కోసం కేంద్రంతో ప్రయత్నాలు ముమ్మరం చేయించారు. ఇందుకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి మిర్యాలగూడ వరకు నూతన రైల్‌మార్గం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే గతేడాది అక్టోబర్ 6వ తేదీన సర్వేకు అనుమతించింది. రైల్వే మంత్రిత్వశాఖ రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ఈ సర్వే ఖమ్మం జిల్లా ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
జిల్లాలోని రఘునాథపాలెం మండలం మొదలు ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల మీదుగా సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అధికారులు సర్వే చేపడుతున్నారు. దీనిపై ఖమ్మం జిల్లాలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఖమ్మం నగరానికి సమీపంలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోని రూ.కోట్ల విలువ చేసే భూములు, ఇండ్లు, వెంచర్లు, ప్లాట్లు ఈ రైలుమార్గం కింద పోనున్నాయి. దాదాపు 300 అడుగుల వెడల్పుతో 90 కి.మీ పైగా నిర్మించే ఈ రైల్వేలైన్‌తో ఖమ్మం రూరల్ మండలంలోనే 800 ఎకరాల వరకు భూములు సేకరించనున్నట్టు అంచనా.
సర్వేను అడ్డుకుంటున్న నిర్వాసితులు
డోర్నకల్ నుంచి జిల్లాలోని మల్లెమడుగు రైల్వే స్టేషన్ మీదుగా ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, ముత్తగూడెం, ఏదులాపురం, మద్దులపల్లి, తెల్దారుపల్లి, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని గువ్వలగూడెం, నేలకొండపల్లి, ఆచార్లగూడెం, కోనాయిగూడెం, బోదులబండ, రామచంద్రాపురం, పైనంపల్లి తదితర ప్రాంతాల మీదుగా కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడెం వరకు నిర్మించాలనేది ప్రతిపాదన. ఇప్పటికే గూగుల్ మ్యాప్ ఆధారంగా సర్వే చేపట్టారు. నేలకొండపల్లి వరకు గతంలోనే ఈ సర్వే పూర్తి చేశారు. తాజాగా ఖమ్మం రూరల్ మండలంలో చేపట్టిన సర్వేను సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ సిబ్బందిని అడ్డుకున్నారు. ముత్తగూడెం, పల్లెగూడెంలో సర్వే సిబ్బందిని వెనక్కి పంపారు.
భూములకు ముప్పు
పవర్‌ప్లాంట్, సిమెంట్ కంపెనీల కోసం వేస్తున్న ఈ రైల్వేలైన్ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రజలు చెమటోడ్చి, పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న వందలాది ఇండ్లు, ముత్తగూడెం, ఏదులాపురం, మద్దులపల్లి, తెల్దారుపల్లి రెవెన్యూలో వెంచర్లు, ప్లాట్లు రైలుమార్గంలో కొట్టుకుపోనున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఏదులాపురం పెట్రోల్ బంక్ సమీపంలోని కోటి ధాబా, ఆదిత్య టౌన్షిప్, వెంకటాద్రినగర్, ఆటోనగర్, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో రూ.కోట్ల విలువ చేసే అనేక ఇండ్లు, ప్లాట్లు, భూములు పోనున్నాయి. బహిరంగ మార్కెట్లో గజం విలువ రూ.10వేల పైమాటే ఉన్నా రిజిస్ట్రేషన్ విలువపై మూడంతలు ఇచ్చినా రూ.4వేలలోపే ప్రభుత్వం లెక్కలు కడుతుంది. ఎకరం రూ.3 కోట్లకు పైగా విలువ చేసే భూములకు రూ.30లక్షల లోపే చెల్లిస్తానంటోంది. నూతనంగా వేసిన డీటీసీపీ లేఅవుట్ వెంచర్ల యజమానుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గ్రీన్‌బెల్ట్, మార్టుగేజ్లు, 60 అడుగుల వెడల్పు రోడ్లతో ఎకరం భూమిలో 18లోపు ప్లాట్లే అయ్యాయి. ఇప్పుడు ఈ రైల్వేలైన్‌తో అక్కడి రిజిస్ట్రేషన్ విలువపై మూడింతలు అధికంగా ఇస్తే గజం రూ.3వేల వరకే పలికే అవకాశం ఉంది. పై పెచ్చు 300 ఫీట్ల వెడల్పుతో వేసే ఈ రైల్వేలైన్ వల్ల దానికి ఇరువైపులా మరో వంద అడగుల మేర ఎటువంటి నిర్మాణాలున్నా నిరుపయోగంగా మారనున్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందే అవకాశం లేదు. దీంతో బిల్డర్లు, ఇండ్ల యజమానులు, నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండ్లు కొంటరో.. లేదోనని భయం
లక్ష్మణ్- న్యూ బిల్డర్- వెంకటాద్రినగర్- ఏదులాపురం
కొత్తగా మేము కడుతున్న ఇండ్ల సమీపం నుంచి రైల్వేలైన్ కోసం మార్కింగ్ చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సుతారి పనిచేసుకుని ఇప్పుడిప్పుడే బిల్డర్లుగా మారాం. ఒకటి, రెండు ఇండ్లు నిర్మించి అమ్ముకుంటున్నాం. ఇప్పుడీ రైల్వేలైన్ మేము కొత్తగా కట్టే ఇండ్ల దగ్గరి నుంచి పోనున్నాయి. వాటిని కొంటారో లేదోనని భయంగా ఉంది. రైల్వేలైన్ కింద ఇండ్లు పోవట్లేదు కాబట్టి పరిహారం కూడా రాదు. మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు.
అలైన్మెంట్ మార్పుకు కృషి చేస్తా..
నామ నాగేశ్వరరావు- ఖమ్మం ఎంపీ
ఈ రైల్వేలైన్ వల్ల అనేక మంది నిర్వాసితులుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రోడ్ల విస్తరణ, జాతీయ ప్రాజెక్టుల కోసం వేలాది ఎకరాల భూములు జిల్లా నుంచి సేకరించారు. కొత్తగా ఈ రైలుమార్గంతో ప్రజలు ఇబ్బంది పడతున్నారనే విషయాలను తెలియజేస్తూ.. రైల్వేమంత్రికి లేఖ రాసిన. అలైన్మెంట్ మార్చేందుకు కృషి చేస్తాను. నిర్వాసితుల పక్షాన పోరాడుతాను.