Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి హరీశ్ రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రయివేటు పరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు హరీశ్ రావు లేఖ రాశారు.
'' డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగసంస్థలను ప్రయివేటీకరించటం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేది. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీన్ని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ''సిక్ ఇండిస్టీ''గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2,500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5,000 మంది ఉపాధి దెబ్బతింటుంది. మొత్తంగా సుమారు 25 వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుంది..... '' అని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ''ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య'' ప్రతినిధులు తనకు ప్రయివైటేజేషన్ ను అడ్డుకోవాలంటూ తనను కలిసి విజ్ఞప్తి చేశారని మంత్రి పేర్కొన్నారు. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ, పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మిషనరీని ఆధునికరించడం ద్వారా ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలనీ, ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.