Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసి చెప్తున్నా..
- మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు
- ఆధారాలు లేకుండా ఈటల ఎలా ఆరోపణలు చేస్తారు? : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-ధూల్ పేట్
''కేసీఆర్‌తో నాకు ఎలాంటి లాలూచీ లేదు.. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసి చెప్తున్నా.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. ఆధారాలు లేకుండా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎలా ఆరోపణలు చేస్తారు..?'' అని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారన్న ఈటల ఆరోపణలపై సవాలు విసిరిన రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని, మూడు నెలల్లో మూడు వందల కోట్ల మద్యం ఏరులై పారిందని అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజా తీర్పు కోరారన్నారు. తమ పార్టీ నాయకులు చందాలు వేసుకొని ప్రచారం చేశారన్నారు. ఆధారాలు లేకుండా ఈటల ఎట్టా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత ఆ పార్టీలో కుమ్ములాటలు అందరికీ తెలిసిందేనన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 వేల ఓట్లు వచ్చాయన్నారు. ఈటల రాజేందర్ వ్యవహారశైలి రెండ్రోజులుగా విచిత్రంగా వుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి ముట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ నిర్మించుకుంటే వ్యతిరేకించి పోరాటం చేస్తున్న తనను చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు కేసీఆర్ పంపలేదా అని గుర్తు చేశారు. తన మనోధైర్యం దెబ్బతీయాలని కేసీఆర్ ప్రయత్నం చేయలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ ప్రభుత్వం అపార్ట్మెంట్స్ పేరు మీద విధ్వంసం చేస్తుంటే నిలబడి కొట్లాడమన్నారు. నేరేళ్ళ ఇసుక దోపిడీపై, మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం, కాళేశ్వరం అవినీతిపై పోరాటం చేశామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై 30 లక్షల మంది విద్యార్థులకు అండగా కాంగ్రెస్ ఈడీకి ఫిర్యాదు చేసిందన్నారు.
తాము తమ జీవితాలను త్యాగం చేసి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నామన్నారు. అలాంటి తమను ఈటల రాజేందర్ అమ్ముడుపోయారని విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తన పార్టీని, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించడం సరికాదన్నారు. ఈటల పట్ల తమకు సానుభూతి ఉండేదని.. కానీ తమ నిజాయితీని ఆయన శంకిస్తున్నారా అని ప్రశ్నించారు. బీజేపీలో ప్రాధాన్యత లేకనే తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను కేసీఆర్‌పై పోరాటం చేస్తుంటే ఈటల మంత్రిగా కేసీఆర్ పక్కన లేరా అని ప్రశ్నించారు. కేసీఆర్ తప్పుల్లో ఈటల భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఆయన నిర్ధారించుకోవాలన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌తో ఎట్టి పరిస్థితుల్లో లాలూచీ పడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.