Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెను విరమింపచేయండి
- సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐకేపీ వీవోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వారు చేస్తున్న సమ్మెను విరమింపజేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,608 మంది ఐకేపీ వీవోఏలు గత 20 ఏండ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు, పదోన్నతులతోపాటు, సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం లేదని పేర్కొన్నారు. వాటి సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీవోఏలు చాలా కాలంగా పలు నిరసన కార్యక్రమాలు చేసినా, ప్రభుత్వం నుంచి స్పందన లేదని వివరించారు. దీంతో ఆరు రోజులుగా మండల కేంద్రాల్లో నిరవధిక సమ్మెకు పూనుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తూ, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సభ్యులకు రుణాలు ఇప్పించి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారని వివరించారు. డ్వాక్రా సంఘాల లావాదేవీలన్నీ రికార్డు చేస్తూ ఎస్‌హెచ్‌జీ లైవ్ మీటింగ్ పెట్టి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారని తెలిపారు. సంఘాల పనులే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలయ్యేలా వారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయినా వారికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నుంచి కేవలం రూ.3,900లు మాత్రమే గౌరవవేతనం ఇస్తూ చేతులు దులుపేసుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామసంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వీవోఏల వ్యక్తిగత ఖాతాల్లోకి కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, గుర్తింపు కార్డులివ్వాలివ్వడంతోపాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రూ.10 లక్షల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. జాబ్ చార్టర్‌తో సంబంధం లేని ఆన్లైన్ పనులను వారితో చేయించొద్దని సూచించారు. వారిపైన మహిళా సంఘాల ఒత్తిడి లేకుండా ఎస్‌హెచ్‌జీలకు వీఎల్ఆర్, అర్హులైన వీవోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని తమ్మినేని ఈ సందర్భంగా తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్ల పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి, ఐకేపీ వీవోఏలకు న్యాయం చేయాలని ఆయన తన లేఖలో కోరారు.