Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యం
- ఈదురుగాలులతో ఆస్తి నష్టాలు, విద్యుత్ అంతరాయం
- కరీంనగర్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన భట్టి
నవతెలంగాణ-విలేకరులు
శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి పలు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసిపోవడమే కాకుండా, వరదకు కొట్టుకుపోయింది. రహదారులపై ఆరబోసిన ధాన్యం సైతం కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతల్లో పంట దెబ్బతిన్నది. వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలు, ఉద్యానపంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఖమ్మం జిల్లా ముదిగొండ, ఖమ్మం, రఘునాధపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. ఆయా మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసింది. భారీ ఈదురుగాలులకు రవాణా వ్యవస్థ స్తంభించింది. ముదిగొండలో మొక్క జొన్నపంట నేలకొరిగింది. మధిరలో భారీ హోర్డింగ్‌లు కూలాయి. ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేట నుంచి కోదాడ క్రాస్ రోడ్డు వరకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ముదిగొండలో భారీ వర్షంలో మంచు గడ్డలు మీదపడటంతో ఓ వ్యక్తి తల పగిలింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల మండలకేంద్రంలో శనివారం రాత్రి ఒక్క సారిగా కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసింది. ఆళ్లపల్లి మండలం కన్నాయిగూడెం గ్రామంలో పిడుగుపడటంతో ఆవు మృతి చెందింది. దుమ్ముగూడెంలో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. టేకులపల్లి మండలంలో మామిడి కాయలు రాలాయి. చెట్లు విరిగిపడటంతో పలు మండలాల్లో విద్యుత్ నిలిచిపోయింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోమారు కురిసిన వడగండ్ల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం సైతం కురిసిన వర్షాలతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు జనగామ జిల్లాలో ఇండ్లపై కప్పులు లేచిపోయి పలు కుటుంబాలు నిరాశ్రయులుగా మారారు. హన్మకొండ జిల్లాలోని పరకాల డివిజన్లోని పరకాల, నడికూడ, శాయంపేట, ఆత్మకూరు, దామెర, హసన్‌పర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లాలో మామిడి తోటల్లో కాయలు మొత్తం రాలిపోయాయి. రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో ఇప్పగూడెం, సముద్రాల, కోమటిగూడెం, అక్కపల్లిగూడెం తదితర గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పొలాలు నేలమట్టమయ్యాయి. హన్మకొండ జిల్లాలో వేలేరు మండలంలో విద్యుత్ స్తంభాలు విరిగాయి.
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన భట్టి
కరీంనగర్ జిల్లాలో ఆకాల వర్షాలతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈక్రమంలో జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షాలు, వడగండ్ల వర్షాలతో రైతుకు ఎనలేని నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.