Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటలను పరిశీలించిన సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ-అర్వపల్లి
వడగండ్ల వానను జిల్లా వ్యాప్తంగా వరి రైతులతో పాటు మామిడి, నిమ్మ, బత్తాయి తదితర తోటల రైతులు పూర్తిగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన రైతులు తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, కాంగ్రెస్ నాయకులు అన్నెపర్తి జ్ఞానసుందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మల్లు నాగార్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంటనేలపాలైందన్నారు. నిమ్మ, బత్తాయి, మామిడి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. అర్వపల్లి మండలవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని, వేల్పుచర్ల, అడివ్వెంల గ్రామాల్లో 400 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయాధికారులు రైతుల పంటనష్టాన్ని అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని కోరారు. పంటనష్టపరిహారం అందించకుంటే మండలంలోని ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ యాదగిరిరెడ్డి ధర్నాకు వద్దకు చేరుకుని రైతులు, నాయకులతో మాట్లాడారు. మండలంలో 10 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని, నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తామన్నారు. కాగా, వేల్పుచర్ల గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి బృందం దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించారు. పరిశీలించిన వారిలో.. సీపీఐ(ఎం) పార్టీ మండల అధ్యక్షులు వజ్ర శ్రీనివాస్, చెరుకు ఏకలక్ష్మీ, మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, వేల్పుచర్ల గ్రామరైతులు ఉన్నారు.