Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కదారి పట్టిన జీవో 58, 59
- రంగారెడ్డి జిల్లాలో 33,830 మంది దరఖాస్తులు
- అర్హత సాధించినవి 5,448
- అధికారుల కనుసన్నల్లోనే పర్మిషన్లు
- క్రమబద్ధీకరణ పేరుతో కాసుల వర్షం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 58, 59 జీఓల లక్ష్యం పక్కదారి పడుతోంది. ఈ జీఓలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములను అక్రమించుకున్న బడాబాబులు క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. రాజకీయ నేతల పలుకుబడి, అధికారుల అండదండలతో భూములను దక్కించుకోవాలని చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వచ్చిన అర్హత లేని దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. దాంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. 'పేరు పేదలది.. లబ్ది మాత్రం పెద్దలది' అన్న చందంగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ నడుస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోను సవరిస్తూ 2014 జూన్ నుంచి 2020 జూన్ వరకు ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు వేసుకున్న వారు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తూ ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చింది. అయితే రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారి సంఖ్య రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. 2006 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 వేల కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. జీవో నెంబర్ 58, 59 కింద ఇప్పటి వరకు జిల్లాలో 33,830 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రస్తుతం 5,448 అర్హత సాధించాయి. రాష్ట్ర ఏర్పాటు తరువాత 58 జీవో ప్రకారం కొంత మందికి పట్టా సర్టిఫికెట్ అందింది. ఇందులో కండిషన్లు ఎక్కువగా ఉండటంతో చాలా మంది అర్హత సాధించలేకపోయారు.
125 గజాల వరకు 58 జీవో ద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా క్రమబద్ధీకరించుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా జాగా ఉంటే 59 జీవో ద్వారా అఫ్లికేషన్ పెట్టుకుని రుసుం చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలి.
పక్కదారి పడుతున్న జీవోలు
అబ్దులాపూర్మెట్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 386లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలకు 59 జీవో ద్వారా రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇదే ప్రాంతంలో మరో సర్వే నెంబర్ 244లో 59 జీవో కింద అఫ్లికేషన్ చేసుకున్నారు. ఇలాంటి దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నాయి. ఇలా పేదలు అక్రమించుకున్న ప్రభుత్వ జాగాలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను బడాబాబులు ఉపయోగించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. కబ్జాకోరులే ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. అధికారుల అండతో ఇంటి నెంబర్, విద్యుత్ బిల్లులు సంపాదించి దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిసింది. ఇందులో రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటం, అధికారుల సహకారం లభించడంతో బడాబాబులకు కావాల్సిన అర్హత సర్టిఫికెట్లు సాధిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం చెల్లించి రూ.కోట్ల విలువ గల భూములను కాజేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, బడాబాబుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని, జీవో 58, 59 పక్కదారి పట్టుకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనల ప్రకారమే క్రమబద్ధీకరణ
జీవో నెంబర్ 58, 59 ద్వారా వచ్చిన ఆఫ్లికేషన్లు పరిశీలించి అర్హత గల వారిని మాత్రమే ఎంపిక చేస్తాం. అనర్హులను పూర్తిగా తిరస్కరిస్తాం. అక్రమార్కులకు అవకాశం లేకుండా పకడ్బందీగా పరిశీలన ఉంటుంది. అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
- హరీష్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్