Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఆదేశాలతో తాళాలు పగులగొట్టిన అధికారులు
- ధర్మపురి స్ట్రాంగ్ రూమ్‌పై సీల్డ్ కవర్లో నివేదిక
- 258 ఈవీఎంల్లోని సమాచార సేకరణ
- ఈనెల 26న హైకోర్టుకు...
నవతెలంగాణ-జగిత్యాల
ధర్మపురి ఎన్నికల వివాదం మరోసారి ఉత్కంఠ రేపింది. హైకోర్టు ఆదేశాలతో ఆదివారం ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వీఆర్కే కళాశాలలో ఏర్పాటు చేసిన ధర్మపురి నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగులగొట్టారు. అనంతరం కీలక పత్రాలు స్వాధీనం చేసుకొని నివేదికలను హైకోర్టుకు సమర్పించనున్నారు. నివేదికలో 17సీ ఫామ్ అత్యంత కీలకం కానుంది. కాగా, ధర్మపురి అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, ఇతర డాక్యుమెంట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో పగులగొట్టాలని హైకోర్టు జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ ఇటీవల ఆదేశించింది. దీని కోసం వడ్రంగి సాయం తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది. బీఆర్ఎస్ (ఆ సమయంలో టీఆర్ఎస్) అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలోని కొన్నిచోట్ల ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, రీకౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని 2019లో హైకోర్టును ఆశ్రయిం చారు. దీనిపై అప్పటి నుంచి పలు దఫాలుగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగుల గొట్టిన అధికారులు తుది నివేదికను ఈనెల 26న కోర్టుకు సమర్పించనున్నారు.ఈ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ధర్మపురి ఎలక్షన్ పిటిషన్ సంబంధించి స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేసిన క్రమంలో అందులో ఉంచిన సుమారు 20కి పైగా ట్రంక్ బాక్సులకు అసలు తాళాలు లేవని తెలిపారు. కేవలం 4 ట్రంక్ బాక్సులకు మాత్రమే తాళాలు వేసి ఉన్నారని, వాటిని పగలగొట్టి ఓపెన్ చేశారన్నారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారులు వస్తే తప్ప తనకు న్యాయం జరగదన్నారు. తనకు న్యాయస్థానం పై పూర్తిగా నమ్మకం ఉందని చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.