Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెన్షనర్లలో అవగాహన పెరగాలి
- షేర్మార్కెట్లకు పెన్షనర్ల నిధుల తరలింపు దారుణం
- తెలంగాణ ఆల్ పెన్షనర్ల రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు పి.నారాయణరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కనీస పెన్షన్ రూ.9 వేల కోసం పెన్షనర్లు పోరాటం చేయడమే మార్గమని తెలంగాణ ఆల్ పెన్షనర్ల రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు పి.నారాయణరెడ్డి నొక్కి చెప్పారు. ఈపీఎఫ్ పెన్షనర్లకు తీవ్రం అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. హయ్యర్ పెన్షన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేయడంలో అనేక సమస్యలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత తక్కువ మందికి పెన్షన్లు ఇచ్చే కుట్రకు పూనుకున్నదని విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'ఈపీఎఫ్ పెన్షనర్లకు అన్యాయం కొనసాగాల్సిందేననా?' అనే అంశంపై ఆదివారం సాయంత్రం వెబినార్‌ను నిర్వహించారు. దీనికి ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పి.నారాయణరెడ్డి మాట్లాడుతూ..కనీస పెన్షన్ రూ.9 వేలు, ధరలకు అనుగుణంగా డీఏ పెంపు, వైద్యసదుపాయాల కల్పన నినాదాన్ని తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కనీస పెన్షన్‌పై చాలా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. హయ్యర్ పెన్షన్ వల్ల కేవలం పది లక్షల మందికే లబ్దిచేకూరుతుందన్నారు. ప్రయివేటు సంస్థల్లో చేస్తున్నవారికి న్యాయం జరిగే అవకాశం చాలా తక్కువ అన్నారు. ఏడో వేతన కమిషన్ ప్రకారం..కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలనీ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ.1000 చేసిందన్నారు. వెయ్యి రూపాయలతో కుటుంబం ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. అందులోనూ కొందరికి 3 శాతం కోత పెట్టడం దారుణమన్నారు. సీబీటీలో కేవలం పది సంఘాలకు చెందిన ప్రతినిధులే ఉన్నారనీ, 43 మందిలో సభ్యుల్లో కార్మిక, పెన్షనర్ల సంఘాలకు ప్రాతినిధ్యం అంతంత మాత్రమేనని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సీబీటీ నిర్ణయాలు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని విమర్శించారు. భగత్ సింగ్ కోషియారి కమిటీ కనీస పెన్షన్ రూ.3 వేలు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏ ఇవ్వాలని చేసిన సిఫారసు బుట్టదాఖలైందన్నారు. 60 నెలల యావరేజి ద్వారా క్యాలికేషన్లో తేడా వల్ల కూడా పెన్షనర్లు నష్టపోతున్నారని చెప్పారు. నష్టాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో రూ.1.57 లక్షల కోట్ల ఈపీఎస్ నిధులను పెట్టుబడులుగా పెట్టడమేంటని ప్రశ్నించారు. ఆ పెట్టుబడులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కొన్ని సంస్థల నుంచి ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పించాలనీ, తద్వారా నిధుల సమీకరణ పెరిగే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకురావాలనీ, దీనివల్ల నిధులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పెన్షనర్లకు న్యాయం చేయాలనే అంశంపై సీబీటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు తీసుకున్న నిర్ణయాలను కూడా మోడీ సర్కారు అమలు చేయడం లేదని విమర్శించారు. 2014లో ఎన్నికలకు ముందు ప్రకాశ్‌జవదేకర్ పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2018లో హై ఎంఫవర్డ్ మానిటరింగ్ కమిటీ రిపోర్టును నేటి వరకూ బహిర్గతం చేయలేదని విమర్శించారు. ఉద్యోగులు, కార్మికుల ఆదా చేసుకున్న సొమ్ము నుంచి 15 శాతం షేర్మార్కెట్కు తరలించే యత్నాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పెన్షనర్లకు నష్టం కలిగించడం దుర్మార్గమన్నారు. ఉన్న నిధుల్లో 25 శాతం మాత్రమే పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారనీ, మిగతాదంతా పెన్షన్ ఫండ్‌కు వెళ్లోందని చెప్పారు. దీనివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్న తీరును వివరించారు. ప్రతి ఏటా జమచేస్తున్న మొత్తంపై వచ్చే వడ్డీని తిరిగి పెన్షనర్లకే పంచాలనే దానిని 2000 సంవత్సరం తర్వాత తుంగలో తొక్కారన్నారు.