Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు వచ్చిన విద్యుత్ సంస్థల ఆర్టిజన్ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు హెచ్-52 యూనియన్ నాయకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు యాజమాన్యానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. అయితే 7 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరిస్తూ కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో తమకు అన్యాయం జరిగిందని ఆర్టిజన్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే వేతన ఒప్పందం జరిగినందున సమ్మెలోకి వెళ్తే, ఎస్మా చట్టం ప్రకారం ఆర్టిజన్లను అక్కడికక్కడే విధుల్లో నుంచి తప్పిస్తామని టీఎస్‌ట్రాన్స్‌కో, జెన్కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాట్లాడేందుకు హెచ్-52 సంఘం నేతలు ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. అయితే వారు ప్రెస్‌క్లబ్ ప్రాంగణంలోకి రాకముందే, గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు అరెస్టులు చేశారు. దీనిపై ఆ సంఘం నాయకులు సాయిలు 'నవతెలంగాణ'తో మాట్లాడుతూ 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి తమ సమ్మె ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. మూడు రోజులుగా తమను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారనీ, ఎస్మా ప్రయోగిస్తామని భయపెడుతున్నారని చెప్పారు. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదనీ, 23వేల మంది ఆర్టిజన్ కార్మికుల సమ్మెలో పాల్గొంటారని స్పష్టంచేశారు. తక్షణం ప్రభుత్వం, యాజమాన్యం జోక్యం చేసుకొని చర్చలు జరిపి, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అరెస్టు చేసిన ఆర్టిజన్ కార్మికులను పంజాగుట్ట పోలీస్టేషన్‌కు తరలించారు.