Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐలు రాష్ట్ర అధ్యక్షులు జి. విద్యాసాగర్
నవతెలంగాణ-ముషీరాబాద్
న్యాయవాద సంస్థల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్ యూనియన్ (ఐలు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 29న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న నిరసనను విజయవంతం చేయాలని ఐలు రాష్ట్ర అధ్యక్షులు జి. విద్యాసాగర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఐలు రాష్ట్ర కార్యాలయంలో సంబంధిత పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 సంవత్సరం నుంచి కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వారికి హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. అలాగే ప్రస్తుతం న్యాయవాదుల కుటుంబ సభ్యుల హెల్త్ కార్డులకు ఉన్న రూ. రెండు లక్షల పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల తల్లిదండ్రులకు కూడా ఈ స్కీమ్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోని నెట్వర్క్ హాస్పిటల్ లిస్టులో చేర్చి వయోపరిమితితో సంబంధం లేకుండా వర్తింపజేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.పార్థసారథి హైదరాబాద్ నగర కార్యదర్శి రామచంద్రా రెడ్డి, అధ్యక్షులు ప్రవీణ్, నాయకులు వెంకటేష్, గణేష్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.