Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ఈ నెల 25 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించిన ఆర్టిజన్లకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 కాలం నాటి చట్టాల ప్రకారం ఉద్యోగులకు ఎలా జీతాలిస్తారని ప్రశ్నించారు. 23 వేల మంది కార్మికులు రాత్రింభవళ్లు పని చేస్తేనే విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. తక్షణమే వారికి కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అడిగితే, వారినే బర్తరఫ్ చేస్తామని బెదిరించడమేంటని మండిపడ్డారు. వారు చేపట్టబోయే సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు.
మాయవతికి ధన్యవాదాలు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కలెక్టర్‌గా పనిచేసిన క్రిష్ణయ్య అనే ఐఏఎస్ ఆఫీసర్‌ను 1994లో ఆనంద్ మోహన్ అనే వ్యక్తి హత్య చేయగా అప్పటి ప్రభుత్వం అతన్ని జైలుకు పంపింది. అయితే ప్రస్తుత నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ దోషిని జైలు నుంచి విడుదల చేయడాన్ని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి ఖండించారు. అణగారిన దళిత వర్గాలకు చెందిన అధికారిని హత్య చేసిన దోషి వైపు ప్రభుత్వం నిలబడడాన్ని విమర్శించారు. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేక ప్రభుత్వంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాయవతికి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఆనంద్ మోహన్ అనే నేరస్తున్ని జీవితకాలం జైలులోనే ఉంచాలని డిమాండ్ చేశారు.