Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నివారించదగ్గ అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంతో నిర్వహిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. 2018లో నిర్వహించిన మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా, కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కండ్లద్దాలను పంపిణీ చేశామనీ, ఈ సారి 100 పని దినాల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగిందని చెప్పారు. 59 రోజుల పనిదినాల్లో కోటి 1.17 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదివారం కంటి వెలుగు, సీపీఆర్ తదితర అంశాలపై వైద్యాధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇంత పెద్ద ఎత్తున కంటి పరీక్షలు నిర్వహించడం ప్రపంచంలోనే మరెక్కడా జరిగి ఉండదనీ, ఇదొక గొప్ప కార్యక్రమం అని తెలిపారు.ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు? ఎంత మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు? అనే అంశాలు ప్రతి రోజు సీఎం కేసీఆర్ తెలుసుకుంటు న్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడి కంటి వెలుగు కార్యక్రమం అద్భుతమంటూ, వారి రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపుల్లో ఉంటూ పరీక్షలు చేయాలన్నారు.
స్క్రీనింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ తప్పకుండా అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. క్యాంపుల నిర్వహణను ప్రణాళికతో నిర్వహించాలనీ, సిబ్బందికి అవసరమైన భోజన, వసతి, వాహన సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన నిధులను ఇప్పటికే ఆయా జిల్లాలకు ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. క్యాంపుల వద్ద వైద్య సిబ్బందికి, పరీక్షల కోసం వచ్చే ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ, ఎండాకాలం కాబట్టి నీడ ఉండేలా ఏర్పాటు, కుర్చీలు, మంచినీరు ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీటన్నింటిని డీఎంహెచ్వోలు చూసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలోనూ కార్యక్రమం అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సూచించారు.
80 శాతం వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి...
అనుకున్న లక్ష్యంలో 66 శాతం గ్రామ పంచాయతీల్లో అంటే, 8,351 గ్రామ పంచాయతీల్లో క్యాంపుల నిర్వహణ పూర్తయిందని తెలిపారు. ''59 పనిదినాల్లో మొత్తంగా కోటి 17 లక్షల 75 వేల, 604 మందికి స్క్రీనింగ్ నిర్వహించడం పూర్తయింది. అనుకున్న లక్ష్యంలో 74.22 శాతానికి ఇది సమానం. ఇందులో 55,29,373 మంది పురుషులు, 62,34,558 మంది స్త్రీలు ఉండగా, 4,896 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 15.86 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 11.47 లక్షల 4 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించడం జరిగింది. 85.50 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని మనం చేసిన పరీక్షల ద్వారా తేలింది. ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేయడంలో హన్మకొండ, వికారాబాద్ జిల్లాలు ముందున్నాయి.... ''అని మంత్రి తెలిపారు. ఆ జిల్లాల డీఎంహెచ్ వోలు, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
41 రోజుల్లో అన్ని జిల్లాలు లక్ష్యం పూర్తి చేయాలి..
మరో 41 రోజుల పనిదినాలు మాత్రమే మిగిలాయనీ, మరింత వేగంగా పని చేయాల్సిన అవసరముందని మంత్రి చెప్పారు. అవసరమైన ప్రతి ఒక్కరికి కంటి వెలుగు సేవలు చేరువయ్యేలా చూడాలన్నారు. ఆయా జిల్లాల్లో పూర్తి చేసేలా డీఎంహెచ్వోలు ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని ఆదేశించారు. కోర్టులు, జైళ్లు, పోలీసు, ప్రెస్, ఆర్టీసీ వారి కోసం నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపుల్లో ఇప్పటి వరకు 26,380 మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, అవసరమైన 9,695 మందికి రీడీంగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 7,136 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించినట్లు చెప్పారు. స్పెషల్ క్యాంపుల సంఖ్య మరింతగా పెంచాలని ఆదేశించారు.
సీపీఆర్ ట్రైనింగ్ వేగవంతం చేయాలి..
సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయిన వారిని కాపాడేందుకు ప్రారంభించిన సీపీఆర్ శిక్షణను మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలతో నిత్యం సంబంధం ఉండే ఆరోగ్య సిబ్బంది, పోలీసు, మున్సిపల్, పంచాయతీ ఇతర సిబ్బందికి ఇప్పటి వరకు 73,370 మందికి సీపీఆర్ శిక్షణ ఇచ్చామనీ, మిగతా వారికి కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. శిక్షణ పూర్తి కాని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల సహకారంతో సత్వరం పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో మాల్ ఓనర్స్, మార్కెట్ కాంప్లెక్స్ అసోసియేషన్స్, ట్రేడ్ అసోసియేషన్స్లకు, కాలేజీ విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వాలన్నారు. మహిళల సమగ్ర ఆరోగ్యం కోసం డీఎంహెచ్ వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రతి మంగళవారం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ డాక్టర్ కె.రమేష్ రెడ్డి, డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.