Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశ రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'నేషనల్ సివిల్ సర్వీస్ డే' సందర్భంగా 21సెంచరీ ఐఏఎస్ అకాడమీ 20వ ఆవిర్భావ సభ మాజీ ఐఏఎస్ అధికారి గోపాల కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సివిల్స్ అధికారులను సన్మానించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే..రాజకీయాలు, సివిల్ సర్వీస్ అధికారుల పనితీరు, న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం పనితీరు బాగుండాలని సూచించారు. తమ బాధ్యతలను నిర్మోహమాటంగా నిర్వర్తించాలన్నారు. జాతీయత అంటే భౌగోళికమైంది కాదన్నారు. దేశ సార్వభౌమత్వమన్నారు. దేశ ప్రజల శ్రేయస్సు అని చెప్పారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ కొరవడిందనీ, ప్రమాణాలు పడిపోయాయనీ, చట్ట సభల్లో కొట్లాడుకోవడం పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కులం, అవినీతి,డబ్బు, నేరమనస్తత్వం పెరిగిపోయిందన్నారు.వీటన్నింటిని కలబోసుకున్న నాయకుడు ప్రజాసేవ ఎలా చేస్తాడని ప్రశ్నించారు.కార్యక్రమంలో 21సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ కృష్ణ ప్రదీప్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐబీఎస్ అనంతపద్మనాభరెడ్డి, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్స్‌పల్ గణేశ్, టెక్కలి సబ్‌కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఐపీఎస్ అధికారి ధీరజ్ కుమార్, ఐఆర్ఎస్ తరుణ్‌రెడ్డి, ఐడీఎస్ఏ వివేకానంద, అకాడమి డైరెక్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.