Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మరింత కష్టపడితే రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం ఖాయమని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే తారకరామారావు అన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆదివారంనాడాయన ఆపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఇంచార్జిలు, ఇతర నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 25న జరిగే బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు వచ్చే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్ళుగా నిలుస్తాయని చెప్పారు. గడచిన తొమ్మిదేండ్లలో మారిన తెలంగాణ ముఖచిత్రంపై ఆ సభల్లో తీర్మానాలు చేయాలని దిశానిర్దేశం చేశారు. దేశంలో కేసీఆర్ అంటే సంక్షేమం అనీ, మోడీ అంటే సంక్షోభం అని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరుకు, ప్రధాని నరేంద్రమోడీ పనితీరుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభలో వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి, విద్య- ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయాలని ఆయన సూచించారు. ఆ తీర్మానాలు ప్రజలను ఆలోచింపచేసేలా ఉండాలని చెప్పారు. నియోజకవర్గ ప్రతినిధుల సభల ద్వారా దాదాపు నాలుగు లక్షల మంది పార్టీ శ్రేణులకు అన్ని కీలక అంశాలపైనా రాజకీయంగా దిశానిర్దేశం చేసేలా ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని తెలిపారు. రాష్ట్రానికి మోడీ చేసిన మోసాలు, బీజేపీ చేసిన అన్యాయాలపై కార్యకర్తలకు వివరించాలన్నారు. టీఆర్ఎస్..బీఆర్ఎస్గా ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చిందో, దానికున్న రాజకీయ ప్రధాన్యత ఏమిటో ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలనీ, ఆ మేరకు ప్రతినిధుల సభల్లో తీర్మానాలు చేయాలని చెప్పారు.