Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. 7,100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ధాన్యం కొనుగోలు వేగంగా జరడం లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండు రోజులుగా అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోయిందని తెలిపారు. మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని 24 గంటల్లో కొనుగోళ్లు చేసే విధంగా కేంద్రాల దగ్గర ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. తేమ పేరు చెప్పి ఐకేపీ, సొసైటీలు, మిల్లర్లు కలిసి తూకం వేసిన తర్వాత తరుగు తీసివేస్తున్నారని పేర్కొన్నారు. మిల్లర్లు అమ్మిన ధాన్యానికి బిల్లులు ఇచ్చిన తర్వాత బిల్లులో ఉన్న మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా అందులో కొంత మొత్తాన్ని తగ్గిస్తున్నారని గుర్తు చేశారు. ధాన్యం కోత సమయంలో మిల్లర్లు సాగిస్తున్న ఈ దోపిడీ పద్ధతులను నివారించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.