Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరూపిస్తే... రాజీనామాకు సిద్ధం
- భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తాను ఆర్డీఎస్ కాలువకు చెందిన సర్వే నెంబర్ 60లో భూముల్ని కబ్జా చేశానంటూ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆరోపించినట్టు తాను భూముల్ని ఆక్రమించలేదనీ, సురవరం ప్రతాపరెడ్డి వారసులు, మరికొందరు రైతుల నుంచి అధికారికంగా భూముల్ని కొనుగోలు చేశానన్నారు. అసలు ఆర్డీఎస్ కాల్వ ఎక్కడ ఉందో రఘునందనరావుకు తెలుసా అని ప్రశ్నించారు. తన ఆస్తులు, జీవితం తెరిచిన పుస్తకం వంటివని చెప్పారు. ఈనెల 27 తర్వాత మీడియా బృందాన్ని రఘునందనరావు చేసిన కబ్జా భూముల పర్యటనకు తీసుకెళ్తాననీ, అక్కడకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కూడా వచ్చి, తాను భూకబ్జాకు పాల్పడినట్టు నిరూపిస్తే, తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. తమ కుటుంబానికి మొత్తం 90 ఎకరాల భూమి మాత్రమే ఉందన్నారు. తన వ్యవసాయ భూమిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు లేవనీ, ఫౌల్ట్రీ,డెయిరీ ఫామ్ షెడ్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. రఘునందనరావు అంగీకరిస్తే ఆయన ఇంటిని తాను తీసుకొని, తన ఇంటిని ఆయనకు ఇచ్చేస్తానని చెప్పారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా సహిస్తాననీ, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే భరించలేనన్నారు. రఘునందనరావు వ్యాఖ్యలు తనను మానసికంగా ఇబ్బందిపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను విలువలు ఉన్న వ్యక్తిని అనీ, ఇప్పటి వరకు ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని అన్నారు. విలేకరుల సమావేశంలో తాను భూములు కొనుగోలు చేసిన సురవరం ప్రతాపరెడ్డి వారసులు కూడా పాల్గొన్నారు.