Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీస్ డే వేడుకల్లో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సివిల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. నాలుగు దశాబ్దాల ప్రభుత్వ సేవలో ఎన్వీఎస్ రెడ్డి చేసిన విశేష కృషికి, అంకిత భావంతో చేసిన సేవలకు, ఆవిష్కరణలకుగాను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించడంలో తాను ఎదుర్కొన్న అసంఖ్యాకమైన అవరోధాలు, ఆందోళనలు, కోర్టు కేసులు, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్వార్థ ప్రయోజనాలతో గోబెల్స్ ప్రచారం, వివిధ ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం వంటి వాటిని వివరించారు. తన దిష్టిబొమ్మను వివిధ మత సంస్థలు, ప్రాజెక్ట్ ప్రత్యర్థులు చాలాసార్లు దహనం చేశారని గుర్తుచేశారు. అయితే తన లక్ష్యాల నుంచి ఎన్నడూ వెనక్కి తగ్గలేదని, అకుంటిత దీక్షతో అసాధ్యమన్న ప్రాజెక్ట్‌ను సుసాధ్యం చేయగలిగామని వివరించారు. యువ సివిల్ సర్వీస్ ఔత్సాహికులు కృషి, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సివిల్ సర్వీస్ అనేది దేశానికి సేవ చేసే అరుదైన అవకాశం అని తెలిపారు. ఇతర అవార్డు గ్రహీతల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ, సివిల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించిన అకాడమీ పూర్వ విద్యార్థులు ఉన్నారు.