Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ జర్నలిస్టు, విమర్శకులు తెలకపల్లి రవి.. 'శ్రీశ్రీ జయభేరి' పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు
నవతెలంగాణ-మియాపూర్
ప్రశ్నించే గొంతులపై ఎన్ని నిర్బంధాలు పెట్టినా వారిని ఆపలేరని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం గ్రంధాలయం ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు, విమర్శకులు తెలకపల్లి రవి రచించిన 'శ్రీశ్రీ జయభేరి' పుస్తకావిష్కరణ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముందుగా ప్రముఖ కవి, విమర్శకులు నిఖిలేశ్వర్ 'శ్రీశ్రీ జయభేరి' పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీశ్రీ రచనలను కొనియాడుతూ పుస్తకం ఆవశ్యకతను చెప్పారు. శ్రీశ్రీ చెప్పిన పదాలను కోడ్ చేస్తూ పుస్తకంలోని ముఖ్య అంశాలను వివరించారు. తెలకపల్లి రవి రచనా శైలి గురించి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పుస్తకం తీసుకురావడం మంచి పరిణామమని అన్నారు. అనంతరం గోరంటి వెంకన్న మాట్లాడుతూ.. ఎంతమంది మేధావులను జైల్లో పెట్టినప్పటికీ ప్రశ్నను ఎవరూ చంపలేరని అన్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలన్నిటిని కేవలం నిర్బంధం ద్వారా ఆపాలని చూస్తోందని, ఇలాంటి వాటిని తట్టుకొని ఈ సమాజం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థులకు బోధించకుండా ఎంతో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మళ్లీ మధ్యయుగాల ప్రాచీన కాలానికి తీసుకెళ్లే ఆలోచనతో పరిపాలన చేస్తుందని ఆరోపించారు. ఎప్పటికీ ప్రగతిశీల భావాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతూనే ఉంటుందని, ఆ పోరాటంలో ప్రగతిశీల శక్తులే విజయం సాధిస్తాయని స్పష్టం చేశారు. కమ్యూనిజం గొప్పతనాన్ని పాట రూపంలో చక్కగా వివరించారు.
పుస్తక రచయిత తెలకపల్లి రవి మాట్లాడుతూ.. శ్రీశ్రీని ఇప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకోవడానికి అతని రచనలే కారణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. సిలబస్ నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ అశ్రాస్తీయ విధానాలను ప్రశ్నించారు. అంతకుముందు తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి, సభ అధ్యక్షులు కె.ఆనందాచారి మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా జనకవనం కార్యక్రమం నిర్వహించారు. పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు.
కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ సభ్యులు అర్. సాంబశివరావు, కార్యక్రమం నిర్వహణ బాధ్యులు కుర్ర అనిల్, లైబ్రరీ ఇన్చార్జి, సాంస్కృ బాధ్యులు ఎన్.శ్రీనివాస్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి నిర్వాహకులు విజరుకుమార్, పి. రవి, జనకవనం నిర్వహకులు తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహనకృష్ణ, సలీమ, అనిల్, పలువురు కవులు, తదితరులు పాల్గొన్నారు.