Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్‌షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వైఫల్యాల నరేంద్రమోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కితే, దేశం బలిపీఠం ఎక్కినట్టే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. ప్రజలు ఇదే బలమైన అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. చేవెళ్ల బహిరంగసభలో కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. డియర్ అమిత్ షా జీ...అని సంభోదిస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ముక్కునేలకు రాసినా... మోకాళ్ల యాత్ర చేసినా... మోసాల మోడీని తెలంగాణ సమాజం నమ్మదు... క్షమించదు అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాదు...అసలు ఢిల్లీ గద్దెపై నుంచి మోడీకి గుజరాత్‌కు ఘర్‌వాపసీ తప్పదన్నారు. 2024లో రాష్ట్రంలో బీజేపీ, ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ అని పేర్కొన్నారు. బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కిందనీ, కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం విలవిలలాడుతున్నదని విమర్శించారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో బీజేపీ ఫుల్ పిక్చర్‌ను దేశప్రజలు 70 ఎమ్ఎమ్లో చూసేశారనీ, ఇక ఏ ట్రయిలర్ అవసరం లేదన్నారు. ఆదానీపై జేపీసీ వేయని బీజేపీకి, సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. మోడీ కరప్షన్‌కు కెప్టెన్...దానికి క్యాప్షన్ బీజేపీ అని ఎద్దేవా చేశారు. ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి ఇంకెంత కాలం కాలుస్తారని అడిగారు. కేంద్ర నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి బారాణా తీసుకుని చారాణా కూడా తిరిగివ్వని బీజేపీకి మిగిలేది బూడిదే అని శాపనార్థాలు పెట్టారు. బీజేపీ అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. గుజరాత్లో మోడీ హయాంలో అమిత్‌షా హౌం మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకుల్లో ఆ రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉన్నమాట నిజం కాదా...గడచిన ఎనిమిదేండ్లలో ఆ రాష్ట్రంలో 13 సార్లు పేపర్ లీక్స్ కాలేదా? అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. దేశంలో 'వ్యాపం' వంటి అతి జుగుప్సాకరమైన స్కాం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.పీఎమ్ కేర్స్‌లో జమైంది ఎంత..ఎలా ఖర్చు చేశారో చెప్పని వారు కాగ్ ఆడిట్ దానికి వర్తించదని నిస్సిగ్గుగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేశారని గుర్తుచేశారు. ఎనిమిదేండ్లుగా కష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ప్రకటించకుండా, ఇక్కడికి వచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తె నమ్మేదెవరు? అంటూ అమిత్‌షాపై ఫైర్ అయ్యారు.