Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్
- కేంద్ర హౌం మంత్రి అమిత్ షా
- చేవెళ్లలో బీజేపీ విజయ సంకల్పసభ
నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని, వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేవీఆర్ గ్రౌండ్లో బీజేపీ చేవెళ్ల లోక్‌సభ విజయ సంకల్ప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరై మాట్లాడారు. ఒవైసీ అజెండాపై సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. మజ్లిస్ అంటే తమకు భయం లేదని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి సర్కార్ నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ పనితీరును దేశం మొత్తం చూస్తోందని చెప్పారు. పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజరుని అరెస్ట్ చేస్తారని తెలిపారు. పేపర్ లీకేజీపై ఇంతవరకు కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పేపర్ లీక్ ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారు కానీ ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మాట్లాడుతూ.. తెలంగాణకు అండగా ఉండేందుకు పులి వేట ప్రారంభించిందని అన్నారు. ఇందులో భాగంగానే అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఒకటో తేదీనే జీతాలిస్తామని తెలిపారు. పదో తరగతి పేపర్ లీకేజ్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరణ్చుగ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, చంద్రశేఖర్, డీకే అరుణ, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు, ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.